పోలవరం ప్రాజెక్ట్‌ పనుల్లో రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ప్రభుత్వం రివర్స్‌ డెవలప్‌మెంట్‌కు పాల్పడిందని, టెండర్ల మాటున రాజకీయ విధ్వంసాలు జరిగేలా జగన్‌ సర్కారు  చర్యలున్నాయని పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మలరామానాయుడు మండిపడ్డారు. టెండర్లద్వారా జగన్‌ ప్రభుత్వం సెల్ఫ్‌గోల్‌ వేసుకుందన్న ఆయన, పోలవరం రివర్స్‌ టెండర్లతో జగన్‌ ప్రభుత్వం ఏం సాధించిందని ప్రశ్నించారు. 2017-2018 హైడల్‌ పవర్‌ప్రాజెక్ట్‌ పనులకు సంబంధించి  ఎల్‌-2గా రూ.3455 కోట్లకు టెండర్లు వేసిన మెగా సంస్థ, అదే ప్రాజెక్ట్‌ పనులకు సంబంధించి, అదే సంస్థ 2019-20లో రూ.2810 కోట్లకు టెండర్లు వేయడం ఎలా జరిగిందన్నారు. 


రెండేళ్ల తర్వాత అదేసంస్థ, అదేపనికి రూ.645కోట్ల తక్కువకు పనులు చేయడానికి ముందుకు రావడం ఎలా సాధ్యమైందన్నా రు? ఈ ప్రక్రియను గమనిస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ సంస్థకు మధ్య ఏదోచీకటి ఒప్పందం జరిగి ఉంటుందని నిమ్మల అనుమానం వ్యక్తం చేశారు. ఏ విధమైన రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టి, ఆసంస్థకు టెండర్లు కట్టబెట్టారో, ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు సమాధానం చెప్పాలన్నారు. రివర్స్‌ టెండర్ల ఫ్రీబిడ్‌కు 8మంది వస్తే, చివరిగా ఒక్కరినే ఎంపికచేయడం, సింగిల్‌ టెండర్‌ ఎందుకు దాఖలైందో, దానివెనుక ఎవరున్నారో జగన్మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలని రామానాయుడు నిలదీశారు. 



ఇప్పటికే పోలవరం పనులు చేస్తున్న సంస్థనే కొనసాగించి ఉంటే, 2022నాటికే హైడల్‌పవర్‌ ప్రాజెక్ట్‌ పనులు పూర్తై ఉండేవన్న ఆయన, అందుకు విరుద్ధంగా రిజర్వ్‌ టెండర్లతో మెగాసంస్థ ఎంపికవల్ల 2024 నాటికి పనులు పూర్తయ్యే దుస్థితి ఏర్పడిందన్నారు. రెండేళ్లకాలం పెంచడం వల్ల రాష్ట్ర ఖజానాపై పలు రకాలుగా భారం పడనుందని నిమ్మల చెప్పారు. హైడల్‌ప్రాజెక్ట్‌ పనులు 28 నెలలు ఆలస్యమైతే, 15,484 మిలియన్‌ యూనిట్ల జలవిద్యుత్‌ ఉత్పత్తిని రాష్ట్రం కోల్పోనుందన్నారు. దానివల్ల ఒక్కోయూనిట్‌ రూ.4కు బయటరాష్ట్రాల నుంచి కొనుగోలు చేసినా, రూ.6193కోట్ల భారం రాష్ట్ర ఖజానాపై పడుతుందన్నారు. 



దానికి తోడు పోలవరం పనులు చేస్తున్న సంస్థను తొలగించడం వల్ల, ఆసంస్థకు చెల్లించాల్సిన నష్ట పరిహారం కింద రూ.1000 కోట్లు, హైడల్‌ప్రాజెక్ట్‌ పనుల్లో పెంచిన కాలవ్యవధి వల్ల ధరలు పెరుగుతున్నందువల్ల అదనంగా మరో రూ.300 కోట్లు , కొత్తగా ఎంపికైన సంస్థకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ మొత్తం కలిపితే జగన్‌ అనాలోచిత చర్యల కారణంగా రాష్ట్రంపై రూ.7493 కోట్ల భారం పడనుందని నిమ్మల పేర్కొన్నారు. ఇదేనా మంత్రి అనిల్‌ చెబుతున్న ఆదా, విజయం అని రామానాయుడు ఎద్దేవా చేశారు. 



ముఖ్యమంత్రి దూకుడుతో తీసుకుంటున్న  నిర్ణయాలు, తెలుగుదేశంపై బురదజల్లాలనే శాడిజపు ఆలోచనలతో ప్రభుత్వం తనకుతానే సెల్ఫ్‌గోల్‌ వేసుకుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారో జగన్‌ సమాధానం చెప్పాలన్నారు. 2013లో ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ 14.5 శాతం తక్కువతో టెండర్లు వేస్తే, ఇప్పుడు మెగా ఇంజనీరింగ్‌ సంస్థ, 12.5శాతం తక్కువకు కోట్‌ చేయడం జరిగిందన్నారు.  ప్రాజెక్ట్‌ పనులు సకాలంలో, పూర్తి చేయాలనుకునే ఏ సంస్థ కూడా 25 శాతం తక్కువకు పనులు చేయడానికి ముందుకు రాదని టీడీపీ ఎమ్మెల్యే తేల్చిచెప్పారు. అలా చేయాలంటే, నాసిరకంగా అయినా పనులు చేయాలి లేదా, వేరే సంస్థకైనా పనులప్పగించాల్సి ఉంటుందన్నారు. 


రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టేలా, గోదావరి జిల్లాల ప్రజలకు ప్రాణ, ఆస్తినష్టం కలిగించేలా  ప్రభుత్వం పోలవరం నిర్మాణ పనులను మెగా సంస్థకు అప్పగించిందని నిమ్మల ఆక్షేపించారు. రివర్స్‌ టెండర్ల వల్ల రాష్ట్రానికి వచ్చింది గోరంత అయితే, పోయింది కొండంత అనే సంగతి ఇప్పటికే అర్థమైందన్నారు. పోలవరంలో హెడ్‌వర్క్స్‌ పనుల అంచనాలు తగ్గించడం వల్ల, ప్రాజెక్ట్‌ నాణ్యత అనేది ప్రశ్నార్థకమవుతుందని టీడీపీ సీనియర్‌నేత జ్యోతుల నెహ్రూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జీవనాడి అయిన ప్రాజెక్ట్‌ విషయంలో ప్రభుత్వం పంతాలకు పోవడం మంచిది కాదన్నారు. అనుభవం లేని కంపెనీకి హైడల్‌పవర్‌ ప్రాజెక్ట్‌ పనులు అప్పగిస్తే, తీరని నష్టం చవిచూడాల్సి వస్తుందని ఆయన రాష్ట్రప్రభుత్వాన్ని హెచ్చరించారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: