ఉన్న‌త విద్య‌కు కేంద్రాలుగా ఉన్న యూనివ‌ర్స‌టీల్లో వాటి పాల‌కుల వ్య‌వ‌హార శైలి వివాదాల‌కు కేంద్రంగా మారుతోంది. చిన్నా చిత‌కా యూనివ‌ర్సిటీల్లో ఇలాంటి పొర‌పాట్లు జ‌రిగే స‌రేలే.. అనుకునే అవ‌కాశం ఉంటుంది. కానీ, పేరెన్నిక‌గ‌న్న యూనివ‌ర్సిటీల్లోనూ పాల‌కుల వ్య‌వ‌హార స‌ర‌ళి వివాదంగా మారుతుండ‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తోంది. గ‌తంలో యూనివ‌ర్సిటీ నుంచి ఒక విద్యార్థి బ‌య‌ట‌కు రావ‌డాన్ని ఆ వ‌ర్సిటీ ఎంతో గ‌ర్వంగా చెప్పుకొనేది. స‌ద‌రు విద్యార్థి వ‌ల్ల ఆ వ‌ర్సిటీకి మంచి పేరు వ‌స్తుంద‌ని, ఉన్న పేరు మ‌రింత‌గా ద్విగుణీకృతం అవుతుంద‌ని భావించేవారు. కానీ, నేడు ఆ ప‌రిస్థితి పెద్ద‌గా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.


ఫీజులు, టీజింగ్‌లు, రాజ‌కీయాల‌తోనే వ‌ర్సిటీల్లో విద్యార్థుల‌కు కాల‌క్షేపంగా మారిపోతున్నాయ‌నే విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకుంటు న్నాయి. దీంతో ప్ర‌పంచ ప‌టంలో ఒక‌ప్పుడు ఎంతో మంచి పేరు మోసిన యూనివ‌ర్సిటీలు ఇప్పుడు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొస్తున్న వ‌ర్సిటీలు, ఇప్ప‌టికే పేరున్న‌వ‌ర్సిటీల్లో జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల మ‌ధ్య న‌లిగిపోతున్నాయి. ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ కూడా హెచ్చ‌రించింది. వ‌ర్సిటీల్లో చ‌దువుల క‌న్నా కూడా మిగిలిన వ్య‌వ‌హారాల‌కు పాల‌కులు పెద్ద‌గా దృష్టి పెడుతున్నార‌ని, విద్య అందించ‌లేక పోతున్నాయ‌ని అంటున్నాయి.


తాజాగా అంత‌ర్జాతీయంగా విడుద‌లైన నివేదిక‌లోనూ ఏపీలోని యూనివ‌ర్సిటీల‌కు పెద్ద‌గా పేరు రాలేదు. ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు యూనివ‌ర్సిటీలు క‌నీసం ఖండించ‌డం కూడా మానేయ‌డం ఇప్పుడు మ‌రింత వివాదానికి దారి తీస్తోంది. తాజాగా ఎస్వీ యూనివ‌ర్సిటీలో న‌లుగుతున్న వివాదాలు కూడా వ‌ర్సిటీల ప‌రువుకు భంగం క‌లిగించేలా క‌నిపిస్తున్నాయి. ఇక్క‌డ విద్యార్థుల‌కు విద్య అందించ‌డం అటుంచితే.. ఆమ్మామ్యాల‌కు తెర‌దీస్తున్నార‌నే వివాదం తెర‌మీదికి వ‌చ్చింది.


ఇంచార్జ్‌గా ఉన్న ఓ రిజిస్ట్రార్ త‌న‌కు న‌చ్చిన విధంగానే పాలిస్తాను, వ‌ర్సిటీని న‌డిపిస్తాను.. అంటూ వ్య‌వ‌హ‌రించ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. ఈ విష‌యం ఇప్పుడు యూనివ‌ర్సిటీలో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌న‌కు న‌చ్చిన వారికే ప‌నులు అప్ప‌గించ‌డానికి బిల్లులు మంజూరు చేయ‌డానికి ఆయ‌నకు అధికారం ఉన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం తీవ్ర వివాదానికి దారితీసింది. ఇలాంటి ప‌రిణామాలు రాష్ట్రంలోని యూనివ‌ర్సిటీల ప‌రువును భంగ ప‌రుస్తున్నా.. ప‌ట్టించుకునే నాథుడు క‌నిపించ‌డం లేద‌ని విద్యార్థులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: