టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వం అనంతపురం జిల్లాలో కియాకార్ల పరిశ్రమను తెచ్చానంటూ గత ఐదేళ్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే కియా గొప్పదనం కేంద్రానిదే అంటారు బీజేపీ వారు.. అబ్బే కియాతో పెద్దగా లాభం లేదంటారు వైసీపీ వారు. అయితే టీడీపీ సోషల్ మీడియా మాత్రం కియాకు చాలా హైప్ ఇచ్చింది.


అయితే ఇప్పుడు కియాను మించిన పరిశ్రమలు తెచ్చేందుకు వైఎస్ జగన్ సర్కారు ప్రయత్నిస్తోందట. ఆటోమొబైల్‌ రాజధాని అయిన అమెరికాలోని డెట్రాయిట్‌ తరహాలో దేశంలో ఎలక్ట్రిక్‌ కార్ల రాజధానిగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందట. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తుండటమే కాకుండా ఈవీ తయారీ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించారట.


ఇందుకు అనుగుణంగా కొత్త ఈవీ పాలసీని రూపొందించే పనిలో పరిశ్రమల శాఖ ఉందని పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అంటున్నారు. ఇప్పటికే తమిళనాడు.. కంపెనీలకు భారీ రాయితీలను ప్రకటిస్తూ నూతన పాలసీని విడుదల చేయడంతో రాష్ట్రం మరింత ఆకర్షణీయ పాలసీని రూపొందించాలని నిర్ణయించిందట. కేవలం రాయితీలే కాకుండా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, మౌలిక వసతులు కల్పించే విధంగా ఈవీ పాలసీని తయారుచేస్తున్నట్లు ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గౌతమ్‌ రెడ్డి తెలిపారు.


ఈవీ వాహన కంపెనీలతో సంప్రదింపులు జరిపామని, పాలసీలో ప్రతిపాదించాల్సిన అంశాలపై పరిశోధన సంస్థల సలహాలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆర్టీసీలో పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్‌ వాహనాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించారని, దీంతో ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థలు రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: