భార‌త‌దేశ ప్ర‌జ‌లు గ‌ర్వించ‌ద‌గ్గ వార్త ఇది. ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశం సియాచిన్. అది దేశ సరిహద్దు రక్షణలో సైన్యానికి అత్యంత కఠినమైన ప్రాంతం. శరీరాన్ని కోసే చలి.. ఎప్పుడు ఉష్ణోగ్రతలు ఎలా పడిపోతాయో తెలియని వాతావరణం.. అలాంటిచోట భారత సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ శాశ్వత నిర్మాణాలు లేవు. నిర్మించడం కూడా సాధ్యంకాదు. దేశ సరిహద్దులోని సియాచిన్‌, కార్గిల్‌ వంటి ప్రాంతాలను పర్యాటక స్థలంగా తీర్చిదిద్దాలని సైన్యం యోచిస్తున్నది. ఇటీవల జరిగిన ఓ సెమినార్‌లో ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ ఈ ప్రతిపాదన చేసినట్లు సైనిక వర్గాలు తెలిపాయి.


లఢఖ్‌తోపాటు సమీప ప్రాంతాలను సందర్శించేందుకు వస్తున్న పర్యాటకులు.. పాకిస్థాన్‌ ఆర్మీతో భారత సైన్యం తలపడిన కార్గిల్‌ హిల్స్‌, టైగర్‌ హిల్స్‌ సందర్శన కోసం ఆర్మీ అనుమతి కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సియాచిన్‌, కార్గిల్‌లోని భారత సైనిక శిబిరాలను సందర్శించాలన్న దేశ ప్రజల ఆసక్తి గురించి పలువురు సైనిక ఉన్నతాధికారులతో ఆర్మీ చీఫ్‌ చర్చించినట్లు తెలిసింది.


ఇప్పటికే దేశంలోని పలు సైనిక శిక్షణ కేంద్రాలు, సంస్థల సందర్శనకు ప్రజలను ఆర్మీ అనుమతిస్తున్నది. సరిహద్దులోని కీలక సైనిక శిబిరాల సందర్శనకూ పౌరులను అనుమతిస్తే వారిలో జాతీయ సమగ్రత భావన పెంపొందుతుందని రావత్‌ అభిప్రాయపడినట్లు సమాచారం. అయితే పర్యాటకులను ఏయే ప్రాంతాల సందర్శనకు అనుమతించాలన్న దానిపై సైన్యం ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తు న్నది. ప్రపంచంలోనే ఎత్తైన సియాచిన్‌ యుద్ధక్షేత్రంలోని అత్యంత చల్లని వాతావరణ పరిస్థితుల్లో సైనికులు గస్తీ నిర్వహిస్తుంటారు.


ఇదిలాఉండ‌గా, సియాచిన్ వంటి చోట‌ సైనికులకు టెలీమెడిసిన్ ద్వారా అత్యవసర వైద్యసేవల్ని అందించేందుకు ఇస్రో సిద్ధమైంది. ఈ మేరకు రక్షణశాఖతో ఇస్రో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం కమ్యూనికేషన్‌కు అవకాశం కల్పిస్తున్న 20 కేంద్రాలకు తోడు, మరో 50 టెలీమెడిసిన్ కేంద్రాలను ఇస్రో ఏర్పాటు చేస్తోంది. 2001లో ఇస్రో ఈ టెలీమెడిసిన్ సేవల్ని ప్రారంభించింది. లడఖ్, అండమాన్, లక్షద్వీప్, ఈశాన్య రాష్ర్టాలతోపాటు పలు గిరిజన ప్రాంతాలకు టెలీమెడిసిన్ నెట్‌వర్క్‌ను విస్తరించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: