వైఎస్సార్ హావభావాలను పుణికిపుచ్చుకుని తండ్రికి తగిన తనయగా పేరు తెచ్చుకున్న వైఎస్ షర్మిల వైసీపీకి పెట్టని కోట అన్నది అందరికీ తెలిసిందే. ఆమె నిస్వార్ధంగా పార్టీ కోసం పనిచేసిన నాయకురాలు. తన నాయకత్వ లక్షణాలను ఎపుడో రుజువు చేసుకున్న షర్మిల వైసీపీ విజయంలో కీలకమైన భూమిక పోషించిన సంగతి తెలిసిందే. షర్మిల జగన్ కి తోడుగా ఉంటూ పార్టీని రీచార్జి చేయడంలో ఎంతో ఉపయోగపడిన సంగతిని నేతలు ఎవరూ విస్మరించలేరు.


ఇదిలా ఉండగా అన్న జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా షర్మిల అలికిడి ఇపుడు ఎక్కడా పెద్దగా లేకుండా పోయింది. జగన్ కొత్త రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా తీరిక లేని బాధ్యతలతో ఉంటున్నారు. ఈ నేపధ్యంలో పార్టీ పరిస్థితిని పట్టించుకోలేని వాతావరణం ఉంది. పార్టీ ఉంటేనే ప్రభుత్వం అన్నది తెలిసిందే. ఇపుడు పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి  ఉంది.


దాంతో షర్మిలను క్రియాశీలం చేసి పార్టీ కోసం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని జగన్ ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. జగన్ ఆమె సేవలను మళ్ళీ పార్టీ వైపుగా వాడుకోవాలనుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. బై బై బాబూ, బై బై పప్పూ అంటూ ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో షర్మిల చేసిన ప్రచారానికి విపరీతమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే.


అదే విధంగా జగన్ జైల్లో ఉన్నపుడు కూడా పార్టీ కూలిపోకుండా కాపాడి ఉప ఎన్నికల్లో పెద్ద ఎత్తున పార్టీ నేతలను గెలిపించిన ఘనత కూడా ఆమెకు ఉంది. షర్మిల ఉపన్యాసాలకు పార్టీ క్యాడర్ ఫిదా అవుతుంది. జనం సైతం ఆమె వైపు ఆకర్షితులవుతారు. ఈ క్రమంలో  షర్మిలకు పార్టీలో పెద్ద పదవి ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.


అదే విధంగా ఆమెను వచ్చే ఏడాది జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఎంపీగా పంపాలని కూడా ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే పార్టీ  వ్యవ‌హరాలు చక్కదిద్దే నమ్మకమైన మనిషి ఉండాలన్న ఉద్దేశ్యంతోనే షర్మిలను పార్టీలో కీలకమైన బాధ్యలలోకి తీసుకోవాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. మరి చూడాలి షర్మిల ఏ హోదాలో జనం ముందుకు వస్తారో.


మరింత సమాచారం తెలుసుకోండి: