గ్రామ సచివాలయ నియామకాల పరీక్ష నిర్వహణ పేరిట నిబంధనలకు నీళ్లొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం లక్షలాదిమంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని, దీనిపై ప్రభుత్వం డొంక తిరుగుడు సమాధానాలు చెప్తూ తప్పించుకోవాలని చూస్తోందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, నిర్వహించిన ఏకైక ఘనకార్యమైన ఉద్యోగాల నియామక ప్రక్రియ మొత్తం అభాసుపాలైందన్నారు. గ్రామసచివాలయ వ్యవస్థ కోసం1,26,728 ఉద్యోగాలివ్వాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ఘోరంగా విఫలమైందన్నారు. 

జూలై 26న ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇస్తే, 21లక్షల 69వేలమంది దరఖాస్తు చేసుకుంటే, 19లక్షల50వేల మంది పరీక్ష రాశారన్నారు. అందులో లక్షా94వేల164 మంది,  అర్హత సాధించినట్లు ప్రభుత్వమే ప్రకటించిందన్నారు. ఈ ప్రక్రియ మొత్తం బాగానే ఉందనుకుం టున్న సమయంలో తీగలాగితే డొంక కదిలినట్లు, పరీక్ష పేపర్‌ లీకేజ్‌, పరీక్ష నిర్వహణలోని లోపాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు రావడం మొదలైందని కాల్వ చెప్పారు. గ్రామసచివాలయ పరీక్ష నిర్వహణలో ప్రభుత్వపెద్దల జోక్యంతోనే ప్రశ్నపత్రం లీకైనట్లు, పరీక్ష రాసిన ఉద్యోగార్ధులే చెప్పడం గమనించాలన్నారు. 


అనంతపురం కేంద్రంగా ఉన్న ఓ కోచింగ్‌సంస్థకు ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం ముందుగా ఎలా చేరిందని కాల్వ ప్రశ్నించారు. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా ఉన్న వ్యక్తి, వైస్‌ఛాన్సలర్‌ పదవికోసం, వైసీపీ నేతలతో చేతులుకలిపి, సెరీకల్చర్‌, హార్టీకల్చర్‌కు సంబంధించిన ప్రశ్నాపత్రాలను బహిర్గతం చేయడం జరిగిందని మాజీ మంత్రి ఆక్షేపించారు. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలతో చేతులు కలిపిన సదరు ప్రొఫెసర్‌ వారి కుటుంబసభ్యులు, బంధువులకు ఆ ప్రశ్నాపత్రాలు అందచేసినట్లు ఆధారాలున్నాయ న్నారు. జగన్‌ ప్రభుత్వం నిర్వహించిన గ్రామసచివాలయ పరీక్ష నిర్వహణను చూస్తే, ఒక పరీక్ష-వంద సందేహాలు అన్నట్లుగా ఉందని కాల్వ ఎద్దేవాచేశారు. అధికారపార్టీ నాయకుల అవినీతి, ధనదాహానికి లక్షలాది మంది నిరుద్యోగుల ప్రతిభ, సామర్థ్యాలు మట్టికొట్టుకుపోయాయ ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 


19లక్షల50వేలమందిలో బడుగు, బలహీనవర్గాలే వారే ఎక్కువగా ఉంటారన్న ఆయన, వారంతా కష్టపడి పరీక్షరాస్తే, చివరకు ఈ ప్రభుత్వం వారిని రోడ్డుపాలు చేసిందన్నారు. జగన్మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు విజయసాయిరెడ్డి మాట్లాడు తూ వాలంటీర్లలో 90 శాతం ఉద్యోగాలు మనవాళ్లకే వచ్చాయి.. అలానే సచివాలయ ఉద్యోగాల్లో కూడా మెజార్టీశాతం మనవాళ్లకే వస్తాయని చెప్పడాన్ని బట్టిచూస్తేనే జగన్‌ ప్రభుత్వం ఈ పరీక్షను ఎంత పారదర్శకంగా నిర్వహించిందో అర్థమవుతోందన్నారు. గ్రామసచివాలయ పరీక్ష నిర్వహణతో తమకెలాంటి సంబంధం లేదని, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖే నిర్వహించి ందని ఏపీపీఎస్సీ సంస్థ స్పష్టం చేసిందన్నారు. వైసీపీ గెజిట్‌ అయిన సాక్షి పత్రికల్లో మాత్రం పరీక్ష ఏపీపీఎస్సీనే నిర్వహించిందని రాయడం జరిగిందన్నారు. 


ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలోనే  సచివాలయ ఉద్యోగాల పరీక్ష జరుగుతోందని, 26.07లక్షల దరఖాస్తులు వచ్చాయని అదే సాక్షిలో మరోవార్త కూడా రాశారన్నారు. మరోవైపు గ్రామసచివాలయ పరీక్షలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ ఛైర్మన్‌ చెప్తుంటే, పరీక్ష ఎవరు నిర్వహించారనే సందేహం అందరికీ కలుగుతోందన్నారు. దీనిపై పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎందుకు నోరెత్తడం లేదని కాల్వ నిలదీశారు. పులివెందులకు సంబంధించిన ఒకవ్యక్తి ఫలానావ్యక్తి మావాడే, రూ. 5లక్షలిస్తాడు, ఉద్యోగమివ్వండి అంటూ ప్రశ్నప్రతాలు బేరంపెట్టినట్లుగా సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయన్నారు. ఇవన్నీ ఒకత్తెయితే, పరీక్షరాసిన అభ్యర్థులకు సంబంధించిన మార్కుల వివరాలను కేటగిరీల వారీగా ఎందుకు బహిర్గతపరచడం లేదని మాజీమంత్రి నిలదీశారు. 


మరోవైపు పరీక్షల్లో టాప్‌ర్యాంకర్‌ అయిన అనితమ్మ బీసీ మహిళ అని, ఆమెకు ఫస్ట్‌ర్యాంక్‌ రాకూడదా అని ప్రశ్నిస్తూ సాక్షి మీడియా మరోమారు బురదజల్లే కార్యక్రమం చేపట్టిందన్నారు.  అనితమ్మ బీసీకాదని, తనదరఖాస్తులోనే ఆమె ఓసీ అని పేర్కొన్న సంగతిని ప్రభుత్వం గుర్తించా లన్నారు. ఒక అబద్దాన్ని నిజమని నమ్మించడానికి సాక్షి మీడియాను ప్రభుత్వం నిస్సిగ్గుగా వాడుకుంటుంటే, జగన్‌పాపాలను, ఆయన ప్రభుత్వ లోపాలను కప్పిపుచ్చడానికి సాక్షి మీడియా కూడా అదేవిధంగా పనిచేస్తోందని శ్రీనివాసులు మండిపడ్డారు. సాక్షి మేథావివర్గం మొత్తం ఇందుకోసమే పనిచేస్తోందన్నారు. 


ఉద్యోగాలొస్తాయనే ఆశతో, రేయింబవళ్లు కష్టపడి పరీక్ష రాసిన అభ్యర్థుల జాబితాను (మెరిట్‌లిస్ట్‌) బయటకు చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదన్నారు. అర్హత సాధించని వారికి కూడా సచివాలయ ఉద్యోగాలు వస్తున్నాయని, సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయన్నారు. అధికారపార్టీ నాయకులు, వైసీపీ ప్రభుత్వానికి కొమ్ముకాసే కొంతమంది యూనివర్శిటీల ఉద్యోగులు ఒక ముఠాగా ఏర్పడి లక్షలాది నిరుద్యోగుల జీవితాల్లో మట్టికొట్టారని కాల్వ పునరుద్ఘాటించారు. దీనికి ఎవరుబాధ్యత వహిస్తారో, ముఖ్యమంత్రి జగన్‌, పంచాయతీరాజ్‌ శాఖామంత్రి సమాధానం చెప్పాలన్నారు. పంచాయతీరాజ్‌ శాఖే ఈ పరీక్ష నిర్వహించింది కనుక, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ, ఆశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, గ్రామసచివాలయ పరీక్ష తిరిగి నిర్వహించాలని తెలుగుదేశంపార్టీ తరుపున కాల్వ డిమాండ్‌ చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: