విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాలను రద్దు చేసే అధికారం మీకులేదని రాష్ట్రహైకోర్టు విస్పష్టమైన ఆదేశాలిచ్చినా కూడా జగన్‌ ప్రభుత్వం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ, కోర్టుతీర్పు తమకు వర్తించదన్నట్లుగా వ్యవహరిస్తోందని రాజ్యసభసభ్యులు, టీడీపీనేత శ్రీకనకమేడల రవీంద్రకుమార్‌    తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు న్యాయస్థానం పరిధిలో ఎందుకు నిలవడంలేదన్న ఆలోచన చేయకుండా, కిందపడినా తమదే పైచేయి అన్నట్లుగా రాష్ట్రప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. విద్యుత్‌ ఒప్పందాలను పున:సమీక్షించాలంటూ రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన జీవో-63 సరికాదంటూ, కేంద్రవిద్యుత్‌శాఖా మంత్రి ఆర్‌.కే.సింగ్‌ లేఖద్వారా హెచ్చరించ డం జరిగిందన్నారు. 

ఎప్పుడో, గతప్రభుత్వాలు చేసిన ఒప్పందాలపై సమీక్షల పేరుతో నానాయాగీ చేస్తున్న జగన్‌సర్కారు, అంతర్లీనంగా తనకు లబ్దిచేకూర్చుకునే ప్రయత్నాలకే పెద్దపీట వేస్తోందని కనకమేడల స్పష్టంచేశారు. ప్రభుత్వమనేది శాశ్వతమని, ప్రభుత్వాధినేతలు మారుతుంటారని,  కావున ప్రభుత్వం చేసిన చర్యలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంటుందని రాజ్యాంగమే స్పష్టం చేసిందని ఎంపీ పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షల పేరుతో తిరగదోడటం, రద్దుచేయడం వంటి చర్యలు కేవలం బ్లాక్‌మెయిలింగ్‌కు మాత్రమే పనికొస్తాయన్నారు. ప్రభుత్వంలో ఉన్నతస్థానాల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి విధానాలు అవలంభిస్తే, మొదటికే మోసం వస్తుందనే సంగతిని గుర్తించాలని కనకమేడల సూచించారు. 


విద్యుత్‌ఒప్పందాల పున:సమీక్షకు సంబంధించిన జీవోను రద్దుచేస్తూ, విద్యుత్‌ కొనుగోళ్ల ధరలు నిర్ణయించేది ప్రభుత్వం కాదు, ఎలక్ట్రిసిటీ రెగ్యుటేటరీ కమిషన్లని గతప్రభుత్వం, హైకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. తన మూర్ఖత్వంతో జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన జీవో-63ని రద్దు చేయడంద్వారా హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టిందన్నారు. పీపీఏలను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. ఇంత జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తనని తాను సమర్థించుకుంటూ ప్రతిపక్ష నేతపై నెపం మోపాలని చూడటం ద్వారా న్యాయస్థానాలను అగౌరవపరిచే చర్యలకు పాల్పడుతోందని ఎంపీ రవీంద్రకుమార్‌ వివరించారు. పోలవరం టెండర్ల విషయంలో కూడా కోర్టు ఆదేశాలను కాదని, సింగిల్‌ బిడ్డర్‌ను ఎంపికచేసి ఒకే సంస్థకు కాంట్రాక్ట్‌ అప్పగించడం జరిగిందన్నారు. 


గతప్రభుత్వ నిర్ణయాల్లో నిజంగా అవకతవకలు ఉంటే, ఈ ప్రభుత్వం తనదగ్గరున్న ఆధారాలను కోర్టులకు సమర్పించకుండా సమీక్షలు, రద్దులు ఎందుకు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. పీపీఏల్లో కుంభకోణాలు జరిగాయి, వాటిని సమీక్షిస్తున్నామంటూ ముఖ్యమంత్రి చెప్పడం, ఆయన ప్రభుత్వంలోని మంత్రులతో ఒక కమిటీ వేస్తే, ఆ కమిటీ నుంచి వాస్తవాలు ఎలా వస్తాయని టీడీపీ నేత ప్రశ్నించారు. ప్రభుత్వం ముందుగానే తాను వేయబోయే కమిటీ ఏం చేయాలో మార్గదర్శకాలు ఇస్తున్నప్పుడు, ఆ కమిటీలు ఏం సమీక్షలు చేస్తాయన్నారు? ఈ విధంగా వేసిన కమిటీనే తప్పపడుతూ హైకోర్టు చెప్పినా కూడా, దాన్ని లెక్కచేయకుండా ప్రభుత్వం ముందుకెళ్లాలని చూస్తే అది కచ్చితంగా కోర్టు ధిక్కారమే అవుతుందని కనకమేడల స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వంద రోజుల్లో ఏం చేసిందంటే చెప్పుకోవడానికి మాత్రమే ఈ సమీక్షలు, రద్దులు పనికొస్తాయి తప్ప, ఏ విధమైన ప్రయోజనం ఉండదని ఆయన ఎద్దేవాచేశారు. పాలన నిర్వహించమని వైసీపీకి ప్రజలు ఓటేస్తే, రద్దుల పేరుతో ఈ ప్రభుత్వం గతపాలకుల పాలనను తిరగదోడుతోందన్నారు. 


ఈ విధమైన చర్యల వల్ల కోట్లాదిరూపాయల ప్రజాధనం దుర్వినియోగమవుతోందన్నారు. పాలన చేతగానివారు, అభివృద్ధి పనులు ఎలా చేయాలో తెలియనప్పుడు, గతప్రభుత్వం చేసిన అభివృద్ధిపై నుంచి ప్రజల దృష్టి మరల్చాలి అనుకున్నప్పుడే ఏ ప్రభుత్వమైనా ఇలాంటివి చేస్తుంద న్నారు. గోదావరిలో మునిగిన పడవను బయటకు తీయడం చేతగాక, ఆ పడవకు తెలుగుదేశం అనుమతిచ్చిందని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు సంకేతమన్నారు. గత ప్రభుత్వం అనుమతిచ్చిందని చెప్పి, అమరావతి నిర్మాణాలను, పాలనాభవనాలను రాష్ట్ర ప్రభుత్వం కూలగొడు తుందా అని ఎంపీ నిలదీశారు. రాజ్యాంగబద్ధమైన పాలన చేయాలనుకునే వారికి ఈ విధమైన ఆలోచనలు రావని ఆయన స్పష్టం చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: