ప్రధాని నరేంద్రమోదీ విష‌యంలో మ‌రో క‌ల‌క‌లంతో కూడిన వార్త వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌ధాని టార్గెట్‌గా అనూహ్య‌మైన కుట్ర జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది. ప్ర‌ధాని, ఆయ‌న న‌మ్మిన‌బంటు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి కుట్ర పన్నుతున్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించినట్లు కేంద్ర హోం శాఖ వర్గాలు వెల్లడించాయి. ఆర్టికల్‌ 370ని రద్దు చేసినప్పటి నుంచి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలు భారత్‌లో దాడులకు ప్రయత్నాలు చేస్తున్నాయని హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి.


మోదీని టార్గెట్ చేసిన క్ర‌మంలో...పాక్ ఊహించ‌ని కుట్ర‌ల‌కు పాల్ప‌డుతోంది. జీపీఎస్‌ను అమర్చిన డ్రోన్ల ద్వారా పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఏకే-47 అసాల్ట్‌ రైఫిళ్లు, గ్రెనేడ్లు, శాటిలైట్‌ ఫోన్లను భారత భూభాగంలోకి జారవిడుస్తున్నట్లు పంజాబ్‌ పోలీసులు గుర్తించారు. తరణ్‌ తరణ్‌ జిల్లాలో వీటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆయుధాలను జారవిడిచేందుకు ఉపయోగించిన సగం కాలిపోయిన డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పాక్‌, జర్మనీ కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్థాన్‌ జిందాబాద్‌ ఫోర్స్‌ (కేజెడ్‌ఎఫ్‌) టెర్రర్‌ మాడ్యూల్‌ను పంజాబ్‌ పోలీసులు ఆదివారం రట్టుచేశారు. కేజెడ్‌ఎఫ్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్‌ చేశారు. పంజాబ్‌తోపాటు జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులకు వారు కుట్రపన్నినట్లు విచారణలో తేలిందన్నారు. డ్రోన్ల ద్వారా పాక్‌ నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి తమకు చేరుతున్నట్లు వారు వెల్లడించారన్నారు. ఇలా ఎనిమిది నుంచి తొమ్మది సార్లు ఆయుధాలను చేరవేశారని వారు చెప్పారన్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో ఛబల్‌ ప్రాంతంలో సగం కాలిపోయిన డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆయుధాలను చేరవేసిన తర్వాత ఆ డ్రోన్‌ తిరిగి పాక్‌కు వెళ్లలేకపోయిందని, జీపీఎస్‌ ఆధారంగా ఉగ్రవాదులు ఆ డ్రోన్‌ ఉన్న ప్రాంతాన్ని నిందితులకు సమాచారమివ్వడంతో వీరు అక్కడకు చేరుకుని దాన్ని కాల్చారని ఆ అధికారి వివరించారు. జమ్ముకశ్మీర్‌లో దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులకు చేరవేసేందుకే వీటిని జారవిడిచినట్లు విచారణలో తేలిందని చెప్పారు.


మ‌రోవైపు  దేశంలోని 30 నగరాలకూ ఉగ్రముప్పు ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ర్టాలను అప్రమత్తం చేసినట్లు హోం శాఖ వ‌ర్గాలు తెలిపాయి. వైమానిక స్థావరాలకూ భద్రతా ముప్పు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని భారత వాయుసేన (ఐఏఎఫ్‌) అధికారులు ధ్రువీకరించారు. న్యూయార్క్‌లో ఐరాస సర్వసభ సమావేశం జరుగుతున్న ప్రస్తుత తరుణంలో వాయుసేనకు చెందిన ఒక ప్రధాన స్థావరంపై ఉగ్రవాదులు దాడికి యత్నించే ప్రమాదం ఉన్నదని తెలిపాయి. ప్రధాన కేంద్రాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశామని, శ్రీనగర్‌, అవంతిపొరా, జమ్ము, పఠాన్‌కోట్‌, హిండన్‌లోని వాయుసేన స్థావరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ఎయిర్‌బేస్‌లలో ఆత్మాహుతి దాడులకు జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నుతున్నదని కేంద్ర హోం శాఖ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీకి ఈ నెల 10న బెదిరింపు లేఖ వచ్చినట్లు వెల్లడించాయి. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసినందుకు ప్రతీకారం తీర్చుకోనున్నట్లు ఆ లేఖలో హెచ్చరించారని వివరించాయి. జైషేకు చెందిన షంషేర్‌ వనీ పేరిట హిందీలో ఈ లేఖను రాసినట్లు తెలిపాయి. 




మరింత సమాచారం తెలుసుకోండి: