గత కొన్ని రోజులనుండి ర్యానిటిడిన్ అనే ట్యాబ్లెట్ గురించి విపరీతంగా వార్తలు వస్తున్నాయి. కేన్సర్ వ్యాధి రావటానికి కారణమైన మాలిన్యాలు ఈ ట్యాబ్లెట్ లో ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ర్యానిటిడిన్ ట్యాబ్లెట్ గురించి వార్తలు వస్తూ ఉండటంతో ఇప్పటివరకు ఈ ట్యాబ్లెట్ ఉపయోగించిన వారు భయపడుతున్నారు. మందులు తయారు చేసే కంపెనీలు కూడా ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఈ ట్యాబ్లెట్లను వెనక్కు తీసుకుంటున్నాయి. 
 
కొన్ని కంపెనీలు ఈ ట్యాబ్లెట్ల తయారీ కూడా నిలిపివేసినట్లు సమాచారం అందుతుంది. ర్యానిటిడిన్ ట్యాబ్లెట్ ను ఎక్కువగా అసిడిటీ సంబంధిత సమస్యల కోసం వాడతారు. అసిడిటీతో పాటు ఇతర జబ్బులను తగ్గించటానికి ఈ ట్యాబ్లెట్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. పొట్ట ఉబ్బరం, అల్సర్లు, గుండెలో మంట సమస్యలకు వైద్యులు సాధారణంగా ర్యానిటిడిన్ ట్యాబ్లెట్ సిఫారసు చేస్తారు. 35 సంవత్సరాల నుండి ఈ ట్యాబ్లెట్ వినియోగంలో ఉంది. 
 
దాదాపు 700 కోట్ల రూపాయల అమ్మకాలు ఈ ట్యాబ్లెట్ నమోదు చేస్తోంది. ప్రముఖ ఫార్మా కంపెనీలు అన్నీ ఈ ట్యాబ్లెట్ ను ఉత్పత్తి చేస్తున్నాయి. తాజా పరిణామాలతో కొన్ని కంపెనీలు ఈ ట్యాబ్లెట్ సరఫరాను నిలిపివేశాయని తెలుస్తోంది. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఈ నెల 9వ తేదీన జెన్ ట్యాన్ బ్రాండ్ పేరుతో మార్కెట్లో ఉన్న  ర్యానిటిడిన్ ట్యాబ్లెట్లను పరిశీలించినపుడు నైట్రోసమైన్ ఇంప్యూరిటీ కొంతమొత్తంలో కనిపించటంతో ఈ ట్యాబ్లెట్ల వలన కేన్సర్ ముప్పు ఉందని తేలింది. 
 
అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ వెల్లడించిన విషయాలతో చాలా దేశాలు ఈ ట్యాబ్లెట్ పై దృష్టి పెట్టాయి. మన దేశంలోని కేంద్ర డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ సోమానీ రాష్ట్రాల్లోని ఔషధ నియంత్రణ సంస్థలకు ఈ ట్యాబ్లెట్ విషయమై లేఖ రాశారు. ఈ లేఖలో రోగుల యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకోవాలని మరియు తగిన దిద్దుబాటు చర్యలను తీసుకోవాలని, ఫార్మా కంపెనీలకు సూచనలు ఇవ్వాలని చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: