ప్రస్తుతం 'ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమన ప్రభావం' అన్నీ దేశాలతో పాటు భారత దేశం పైనా పడుతుందనే ఆందోళన ఆర్థికవేత్తల ద్వారా నిరంతరం వ్యక్తమౌతూ వస్తుంది. నవంబరు 8, 2016 అర్ధరాత్రి నుంచి వెయ్యి మరియు ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేసినప్పటి నుండి బిందువులా మొదలైన ఆర్ధికమాంద్యం   2017 లో జి ఎస్ టి అమలులోకి వచ్చిన సమయానికి ((01/07/2017) ప్రవాహమై నేడు సింధువులా రూపాంతరం చెందింది. దాని ప్రభావంతో దేశ జిడిపి చుట్టూ పతన చాయలు కమ్ముకుంటున్నాయి.

 

దీనికి  అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం ప్రభావం కూడా తోడై ప్రపంచ ఆర్థిక వ‌ృద్ధి రేటు ఈ సంవత్సరాంతానికి మరింత పడిపోనుందని - అది ఈ దశాబ్ద కనిష్ఠ స్థాయికి చేరుకుంటుందని పారిస్ కేంద్రంగా పనిచేసే ఆర్గనైజేషన్ ఫర్ ఏకనమిక్ కోపరేషన్ మరియు డెవలప్మెంట్ఓఈసిడి ఇటీవల వెల్లడించింది.

 

అగ్నికి ఆజ్యం తోడైనట్లు సౌదీలో తాజాగా జరిగిన చమురు క్షేత్రాలపై దాడులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మాంద్యం ముప్పు తెస్తుందని చెప్పక తప్పదు. అదే జరిగితే, చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే మన దేశ ఆర్థిక వ్యవస్థపైనా ఆ ప్రభావం పడక తప్పదు.

 

మన దేశ ఆర్థిక వ్యవస్థ గమనాన్ని పరిశీలిస్తే గత త్రైమాసికాలంలో జీడీపీ వృద్ధి, జీడీపీ వృద్ధి రేటు క్రమంగా తగ్గడం దేశాన్ని కలవర పెడుతోంది. దీనికి తోడు దేశీయం గా వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గుముఖం పట్టడం దాని ప్రభావం వ్యాపార కొనగోళ్ళ లావాదేవీలలో ప్రస్పుటంగా కనిపిస్తూనే ఉంది. ఇది మరింత ఆందోళనకు కారణమవుతోంది. చమురు ధరలు పెరగడం, మరోవైపు స్టాక్ మార్కెట్లు నీరసించడం చూస్తుంటే-మనదేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతున్న దాఖలాలు కనిపిస్తూ ఆర్థిక మాంద్యం దేశాన్ని ఆర్ధిక అందకారంలోకి నేట్టేసే చాయలు కనిపిస్తుండగా - ఆర్ధికవెత్తలలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 

కొంతమంది ఆర్థశాస్త్ర నిపుణులు ఈ పరిస్థితికి కారణం ఆర్థిక మాంద్యమా? ఆర్థిక వృద్ధి రేటు మాంద్యమా? అనే మీమాంసలో పడిపోయారు. కొంతమంది ఆర్థిక వేత్తలు మాత్రం ఇది ఆర్థిక మాంద్యం కాదని, ఆర్థిక వృద్ధి రేటు మాంద్యం అని నిర్ద్వంధంగా చెపుతున్నారు. ఈ రెండింటికీ తేడా ఏమంటే జీడీపీ వృద్ధి వరుసగా రెండు త్రైమాసికాల్లో తగ్గితే అది ఆర్థిక మాంద్యం.  అలాకాకుండా వరుసగా పలు త్రైమాసికాల్లో దేశ జీడీపీ వృద్ధిరేటు తగ్గుతూ వస్తుంటే దానిని “అభివృద్ధి తిరోగమనం -గ్రోత్ రెసిషన్” అంటే జీడీపీ వృద్ధి రేటు మాంద్యం అంటారు.

 

ఇప్పుడు భారత్‌ జీడీపీ వృద్ధి రేటు పతనాన్ని చవి చూస్తుందని కొంతమంది ఆర్థిక నిపుణులు వివరిస్తున్నారు. కారణం ఈ ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసి కంలో జీడీపీ తగ్గడానికి అనేకానేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా

 

*అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం దీని కారణంగా చైనాకు మన దేశ ఎగుమతులతోపాటు – అక్కడి నుండి దిగుమతులు కూడా పరిమాణాత్మకంగా పడిపోయాయి.

*దీనికి తోడు అమెరికా మన దేశాన్ని “జనరలైజ్డ్ సిస్టం ప్రిఫరెన్స్ - జీఎస్‌పీ” నుంచి తప్పించింది. దానికి కారణాలు అనేకం. 

*2011 నుంచి భారత్‌ లో పెట్టుబడుల వృద్ధి రేటు తగ్గుతూ వస్తోంది.

ఏ దేశంలో అయినా కొత్త పెట్టుబడులే కొత్త ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగాన్ని తగ్గిస్తుంది. ఈ మద్య కాలంలో దేశంలో నిరుద్యోగం విపరీతంగా ప్రబలిందనే చెప్పాలి. 

*జీఎస్టీ వసూళ్లు కూడా అంచనాలకు అందని స్థాయికి పడిపోవటంతో ఆర్థిక పరిస్థితి అంత అనుకూలంగా లేకపోవటం తద్వారా ప్రభుత్వం తన వ్యయం స్వయంగా తగ్గించుకుంది. ఇవన్నీ దేశ జీడీపీపై, ప్రభావం చూపించాయి.

 

ఆర్ధిక వృద్ధి రేటు మాంద్యం లేదా జీడీపీ వృద్ధి రేటు మందగించడం రెండూ కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అంశాలే. నిజంగా చెప్పాలంటే - ఇదొక “విషస్ సర్కిల్ అంటే విష వలయం” ఇందులో గనుక చిక్కుకుంటే దేశం ఆర్ధికంగా ఊబిలో పడినట్లే. శ్లేష్మంలో పడ్డ ఈగలా కొట్టుమిట్టాడాల్సిందే 

 

భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్‌ అంటే తొలి త్రైమాసికంలో  నిరాశాజనకమైన పనితీరు కనబరిచింది. ఫలితంగా దేశ జీడీపీ వృద్ధి ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయిందని ఆర్ధిక నిపుణులే ప్రకటించారు. దరిమిలా జీడీపీ వృద్ధి రేటు కూడా 5% కి పడిపోయినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. రానున్న ఈ నెల సెప్టెంబర్ తో ముగిసే త్రైమాసిక అంతానికి కూడా పెద్ద ఆశాజనకమైన మార్పేమీ ఉండకపోవచ్చు. 

 

నోట్ల రద్దుతో ఇతర దేశ ప్రయోజనాలు ముడిపడి ఉన్నా - రద్దు జరిగిన నాటి నుండే భారత ఆర్థిక వ్యవస్థ సమస్యల సుడిగుండంలో పడిపోయిందనే వాదనలూ వినిపిస్తూ నే ఉన్నాయి. 

జీడీపీ వృద్ధి రేటు తగ్గడానికి గల కారణాల్లో ముఖ్యమైనవి: 

వ్యవసాయ ఉత్పత్తిలో క్షీణత,

తయారీ రంగం నెమ్మదించడం,

దేశీయ డిమాండ్ పడిపోవడం.


గత ఏడాది వ్యవసాయ రంగం పరిస్థితి ఆశాజనకంగా లేకపోవటంతో ఆహార ధాన్యాల దిగుబడి కూడా తగ్గింది. ఫలితంగా రైతాంగం ఆర్ధిక వెసులుబాటులేని స్థితిలో తమ ఖర్చులు తగ్గించుకుంది. ఇది కూడా దేశ అంతర్గత డిమాండ్‌ ను ప్రభావం చేసింది.

మన దేశం ‘దేశీయ అంతర్గత డిమాండ్‌’ పైనే ఆధారపడి వృద్ధి సాధిస్తూవస్తుంది. మన దేశ ఎగుమతుల విలువ దాదాపు 500 బిలియన్ డాలర్లు – మిగతా దంతా దేశ అంతర్గత డిమాండ్ మాత్రమే. 2008లో ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్నప్పుడు మన దేశం మాత్రం మన అంతర్గత డిమాండ్ కారణంగా పరిస్థితిని తట్టుకుని నిలబడ గలిగింది. అయితే ఈసారి మాత్రం దేశీయ డిమాండ్ పడిపోయి అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.

దేశ అంతర్గత డిమాండ్ తగ్గటానికి కారణం వివిధ వర్గాల నుంచి కొనుగోళ్లు తగ్గడం. కొనుగోళ్లు తగ్గడానికి కారణం, సామాన్యుడు వివిధ కారణాలతో తన ఖర్చులు తగ్గించు కోవడం, ప్రధాన కారణం నిరుద్యోగం రేటు గత 45 ఏళ్లలో ఎన్నడూ లేని అధమ స్థాయికి పడిపోయింది. ఉద్యోగాలే లేని స్థితిలో ప్రజలకు ఖర్చు చేయటానికి డబ్బు ఎక్కడ్నించి వస్తుంది.

ఈ విషవలయం నుంచి బయట పడాలంటే, జీఎస్టీ నిబంధనల్లో స్లాబ్ రేట్లను తగ్గించటం ద్వారా మార్పులు తీసుకురావాలి. అంటే ఎక్కువ మంది పన్ను చెల్లించేలా అంటే కొనగోళ్ళను ప్రోత్సహించాలి. (ఈ విషయంలో దేశ ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ గత శుక్రవారం తగువిధంగా స్పందించారు దాని ప్రభావంతో దేశీయ మార్కెట్లు సెన్సెక్స్ 2000 పాయింట్ల పెరుగుదలతో  దూసుకెళ్ళింది)

 

మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఋణ వితరణలో మార్పులు తీసుకురావాలి. పారిశ్రామిక రంగానికి, వినియోగదారులకు ఋణ సదుపాయాలను, వడ్డి రేట్లను మెరుగు పరచాలి. తద్వారా పెట్టుబడులు పెరిగి కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాయి. అలాగే దేశీయ ఆటోమొబైల్ వ్యవస్థను చమురు ప్రభావం నుండి దారి మళ్ళించి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్ళించటానికి కావలసిన మినహాయింపులతో కూడిన ఆచరణాత్మక సహకారం అందించాలి.

అలాగే వ్యవసాయరంగం అభివృద్ధికి తగిన చర్యలు తీసుకొని గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి పెంపుకు ఊతం ఇచ్చేలా ప్రభావితం చేయాలి.

ఆర్బీఐ నుంచి మిగులు నిధులను దేశ ఆర్ధిక అవసరాలు తీర్చటానికి, ఉత్పాదక రంగం వైపు (ఖచ్చితంగా అనుత్పాదక రంగానికి మాత్రం కాదు) దారి మళ్ళించైనా ప్రభుత్వ వ్యయాలు పెంచాలి అప్పుడే ఆర్థిక వ్యవస్థ కొంతైనా పుంజుకునే అవకాశం ఉంది.

Image result for economic downturn in India RBI governor 

ముంబైలో ఇటీవల జరిగిన ఒక ఆర్థిక సదస్సులో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మన  ఆర్థిక వ్యవస్థ మరీ అంత ఆందోళనకరంగా లేదని, మనం మరీ అంతగా చింతించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా అడుగులు వేస్తున్నా, అంతర్జాతీయంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా, ఆ ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ పై అంతగా ఉండదని అన్నారు. కారణం దేశ జీడీపీలో విదేశీ రుణాలు 19.70 శాతం మాత్రమే ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే కొన్ని సంస్కరణలు అవసరమని శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. వెంటనే ఆర్ధికశాఖ తదుపరి రోజే జిడీపిలో బలమైన మార్పులు చేసినట్లు ప్రకటన వెలువరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: