విజయవాడ నుంచి విశాఖ వెళ్ళడానికి కనీసం పది గంటలకు పైగా సమయం పడుతుంది. రైళ్లు బస్సులు అందుబాటులో ఉన్నప్పటికీ రద్దీ కారణంగా అవేమి కూడా అందుబాటులో ఉండటం లేదు.  బస్సుల్లో ప్రయాణం చేయాలి అంటే వందలాది రూపాయలు ఖర్చు చేయాలి. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు పడకుండా రైల్వేశాఖ ఉదయ్ ఎక్స్ ప్రెస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 9 కోచ్ లు ఉండే ఈ డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్ లో విజయవాడ నుంచి విశాఖకు కేవలం ఐదున్నర గంటల్లో చేరుకోవచ్చు.  


కేవలం ఛార్జి రూ. 525 రూపాయలు మాత్రమే ఉంటుంది.  ఈరోజు ఈ ఉదయ్ ఎక్స్ ప్రెస్ ను రైల్వే సహాయ శాఖామంత్రి ప్రారంభించారు.  విశాఖ నుంచి ఉదయం 11:50 బయలుదేరి సాయంత్రం 4:30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.  అలానే విజయవాడలో సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరి రాత్రి 11:00 గంటలకు విశాఖకు చేరుకుంటుంది.  అందరికి అందుబాటులో ఉండే విధంగా చార్జీలు కూడా ఉండటంతో ఉదయ్ ఎక్స్ ప్రెస్ కు ఆదరణ లభిస్తుందని రైల్వే అధికారులు చెప్తున్నారు.  


అన్ని రకాల ఆధునిక హంగులతో ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది.  9 కోచ్ లలో ట్రైన్ స్టేషన్ వివరాలను తెలియజేసేందుకు డిస్ప్లే తెరలు ఉన్నాయి.  దీంతో పాటు ప్రతి కోచ్ చివరన కాఫీ, టి మేకింగ్ మిషిన్లు అందుబాటులో ఉన్నాయట.  అలానే ప్రతి మూడు కోచ్ లకు ఒక పాంట్రీ అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు చెప్తున్నారు.  రద్దీగా ఉండే రైల్వే రూట్ లలో విజయవాడ.. విశాఖ రైల్వే రూట్ ఒకటి.  అందుకోసమే ఈ రూట్ లో ఈ ట్రైన్ ను తీసుకొచ్చినట్టు రైల్వే శాఖ సహాయమంత్రి పేర్కొన్నారు.  


ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ రానూ..పోనూ దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలు 9 ఏసీ డబుల్‌ డెక్కర్‌ కోచ్‌లు, 2–మోటార్‌ పవర్‌కార్‌ల తో నడుస్తుంది.  వారంలో ఐదు రోజులు ఈ ట్రైన్ విజయవాడ.. విశాఖల మధ్య పరుగులు తీస్తుందట.  గురువారం, ఆదివారం రోజున ట్రైన్ నడవదు.  సౌత్ లో ఈ టైపు ట్రైన్ ఇది రెండోదని అన్నారు.  కోయంబత్తూర్.. బెంగళూరు మధ్య ఉదయ్ ఎక్స్ ప్రెస్ ఒకటి నడుస్తున్నట్టు మంత్రి తెలియజేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: