ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణీకుల కల నెరవేరింది. సకల సౌకర్యాలతో నడిచే ఉదయ్ రైలు పట్టాలెక్కింది. కోయంబత్తూరు-చెన్నై తర్వాత దేశంలోనే రెండో రైలు ఇది. ఈ ట్రైన్  విశాఖ-విజయవాడ మధ్య వారానికి ఐదు రోజులు పరుగులు తీయనుంది. ఉదయ్ డబుల్ డెక్కర్ రైలును రైల్వే శాఖా సహాయ మంత్రి సురేష్ అంగాడీ లాంఛనంగా ప్రారంభించారు.    


అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎక్స్‌ప్రెస్‌ స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే సహాయమంత్రి సురేష్‌  చెప్పారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఏసీ, డైనింగ్‌ సదుపాయాలు, టీవీ, అనౌన్స్‌మెంట్‌ లాంటి అత్యాధునిక వ్యవస్థలతో తీర్చిదిద్దిన సరికొత్త రైలు లాంఛనంగా పరుగులు ప్రారంభించింది. రైల్వేల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించడం ద్వారా మెరుగైన సౌకర్యాల కల్పన, ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. విశాఖ కేంద్రంగా జోన్ ఇచ్చినా, వాల్తేరు డివిజన్ అడుగుతున్నారనీ.. ఈ డిమాండ్ ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు సురేష్ అంగాడీ. 


ఏపీకి కేంద్రం చాలా ప్రాధాన్యత ఇస్తోందని, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రానికి ప్రత్యేకంగా రైల్వే జోన్ ఇచ్చారని బీజేపీ ఎంపీ జీవీఎల్ గుర్తుచేశారు. వాల్తేరు డివిజన్ ను విశాఖ జోన్‌లోనే కొనసాగించేలా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు. 
ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రతీ సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో  నడవనుంది. విశాఖలో తెల్లవారుజామున 5.45 గంటలకు బయలుదేరి వయా దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు మీదుగా ఉదయం 11.15 గంటలకు విజయవాడ  చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడలో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి విశాఖకు రాత్రి 11 గంటలకు చేరుకుంటుంది. ఉదయ్ ఎక్స్ ప్రెస్ లో 9 డబుల్‌డెక్కర్‌ కోచ్‌లు, రెండు పవర్‌కార్లు ఉంటాయి. విశాఖ-విజయవాడ టికెట్టు ధర 525 రూపాయలుగా నిర్ణయించారు. ప్రస్తుతం విశాఖ-తిరుపతి మధ్య తిరుగుతున్న డబుల్‌డెక్కర్‌ ధరలనే ఈ రైలుకు కూడా అన్వయించారు. మంగళవారం రాత్రి నుంచే ఉదయ్ ఎక్స్ ప్రెస్ టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. 


ఉత్కృష్ఠ్‌ డబుల్‌ డెక్కర్‌ ఎయిర్‌ కండిషన్డ్‌ యాత్రీ ఎక్స్‌ప్రెస్‌-షార్ట్ కట్లో చెబితే ఉదయ్. ఉదయ్ గంటకు 64 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైలులో 8డబుల్‌ డెక్కర్‌ ఏసీ ఛైర్‌కార్‌లు... 2 పవర్‌కార్‌లు ఉంటాయి. ఒక్కో డబుల్‌ డెక్కర్‌ కోచ్‌లో పైనా కింద కలిపి 120 సీట్లు ఉంటాయి. ప్రత్యేక డైనింగ్‌ ఉన్న 3 కోచ్ ల్లో మాత్రం 104 సీట్లున్నాయి. ప్రయాణ సమయంలో ఎక్కువ కుదుపు లేకుండా కోచ్‌ల మధ్య సీబీసీ కప్లింగ్‌లను బ్యాలెన్స్‌డ్‌ డ్రాఫ్ట్‌గేర్లను అమర్చారు. ఉదయ్ డబుల్ డెక్కర్ రైలులో ప్రయాణికుల సౌకర్యానికి పెద్దపీట వేశారు. అనేక ప్రత్యేకతలు ఈ రైలు సొంతం. కలర్ ఫుల్ ఇంటీరియర్స్... ఫ్రీ వై-ఫై... విశాలమైన గ్లాస్ విండోస్... రెడ్ కలర్ ఫుష్ బ్యాక్ సీటింగ్ ఎరేంజ్మెంట్ ప్యాసింజర్లను ఆకట్టుకోనున్నాయి. LED స్క్రీన్స్... బయోటాయిలెట్స్, లగేజీ కోసం ర్యాక్స్ ఏర్పాటు..  ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆకర్షణలు ఈరైలు సొంతం. కోచ్‌ మధ్యలోని సీట్లకు...చివర్లోని సీట్లకు మధ్య డైనింగ్‌ టేబుల్‌ ఉంటుంది. ప్రతీ 3కోచ్‌ల మధ్య ఓ కోచ్‌లో డైనింగ్‌ హాల్‌ ఉంటుంది. వాటర్, కూల్ డ్రింక్స్ అందుబాటులో ఉంటాయి. మనం కోరుకున్న డ్రింక్ తాగేందుకు ఆటోమెటిక్ వెండింగ్ మిషన్ ను ఐ.ఆర్.సి.టి.సి ఏర్పాటు చేసింది. ఉదయ్ రైల్లో ప్యాంట్రీకార్ లేకపోవడంతో మీల్స్ ఆన్ వీల్స్ సౌకర్యం కల్పించారు. ప్రయాణికులు తమకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేస్తే నేరుగా డైనింగ్ హాల్ దగ్గరకు తీసుకొస్తారు. ఉదయ్ రైలు అందుబాటులోకి రావడం వల్ల రాజధాని అమరావతికి ఉత్తరాంధ్ర నుంచి కనెక్టివిటీ మరింత పెరగనుంది. పగటి పూట జన్మభూమి, రత్నాచల్, సింహాద్రితో పలు షెడ్యూలింగ్ రైళ్లు ఉన్నప్పటికీ రద్దీ చాలా ఎక్కువగా ఉంటోంది. ఉదయ్ డబుల్ డెక్కర్ తో కొంత మేర సమస్య తీరినట్టేనని చెప్పుకోవచ్చు.






మరింత సమాచారం తెలుసుకోండి: