నీవు జాగ్రత్తగా ఉండక పోతే, సంపూర్ణ శ్రద్ధాసక్తులతో గమనించకపోతే, అధ్యయనం చేయకపోతే వార్తా పత్రికలు పీడితులను అసహ్యించుకునేటట్లు,  పీడించేవారిని ప్రేమించేటట్లు చేస్తాయి - అని మాల్కం ఎక్స్ -(19.05.1925 - 21.02.1965) అన్నారు.


అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అక్షరాలా జరిగేది అదే. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అత్యద్భుత మీడియా మేనేజ్మెంట్ స్కిల్ ను తనకే స్వంతమైన విధానాలను అమలు చేయటం ద్వారా మరోసారి ఋజువు చేస్తున్నారని చెప్పొచ్చు. 


"ప్రజాస్వామ్యం పత్రికారంగానికి ఇచ్చిన స్వేచ్ఛను పెట్టుబడిదారీ వ్యవస్థ మింగేసింది. లాభాపేక్ష విపరీతంగా ప్రబలిన పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రసార మాధ్యమాల విలువలను సమూలంగా ధ్వంసం చేసింది”


నేటి పెట్టుబడిదారీ యాజమాన్య పత్రికారంగం ఏనాడో తెలంగాణాలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించి చావుతప్పి కళ్ళు లొట్టబోగొట్టుకుంది. అలాగే ఇప్పుడు ఎపిలో ప్రజాస్వామ్య విద్వంసం ప్రబలి పోతొందన్న అభిప్రాయాన్ని జనబాహుళ్యంలోకి విస్తృతంగా జొప్పించటానికి ఒక అతి సూక్ష్మ సంఘటనను ఆధారం చేసుకొని జాతీయ పత్రికారంగాన్ని ప్రబావితం చేయటానికి విశేషకృషి చేశారని భావించే సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 


ఈ మధ్య ప్రతిపక్ష నాయకుడు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా స్వేచ్చ గురించి, ప్రజాస్వామ్యం పరిరక్షణ గురించి ఊకదంపుడు ఉపన్యాసం చేస్తుంటే జాతీయ మీడియా - ఆంగ్ల పత్రికలు ప్రచురించిన  కదనాలు, సంపాదకీయాలు ఆశ్చర్యం మాత్రమే కాదు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇక్కడి మీడియా వేసే పగటి వేషాలు కరతలామలకాలే. కాని ఎంతో విజ్ఞత పాటిస్తుందన్న జాతీయ మీడియా కూడా విచిత్రంగా – జాతీయ స్థాయిలో విస్తృత ప్రయోజనాలను ఆశించే అలవాటున్న - ఆ జాతీయ మీడియా కూడా సర్వం విస్మరించి ఇక్కడి  ప్రాంతీయ మీడియా తరహాలో హీనాతిహీన స్థాయికి దిగజారటానికి ఏ జాతి ప్రయోజనాలు ఆధారభూతమయ్యాయి? దీనికి సమాధానం తెలుగువాళ్ళకు తెలిసినంత వేరే వాళ్ళకు తెలియదు.


అయితే జాతీయ మీడియా కూడా ఇంతలా దిగజారిందా? అన్న అనుమానం అతి సాధారణ వ్యక్తుల మనోఫలకాలపై చెదరని దృశ్యంగా చిత్రించుకు పోయింది. విఙ్జులకు సునాయాసంగా అర్దం అయిపోతుంది. కారణం ఒక వార్త - ఎపి ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు శాంతియుతంగా ర్యాలీకి తరలుతుంటే ప్రభుత్వం గృహ నిర్భందం చేసిందని  ఒక ప్రముఖ పత్రిక ఉటంకించింది. మరో పత్రిక ఇదంతా ప్రతీకార రాజకీయాలు అని ప్రభోదించింది.


తొలినుంచీ విలువలకు నెలవైన ‘ది హిందూ’ అయితే ఎన్నడూ లేని విధంగా మొదటి పేజీలో పావు భాగాన్ని వాడేసి - చంద్రబాబు ఆత్మకూరు వెళ్లకుండా నిలువరించిన కదనాన్ని ప్రచురించటం విడ్డూరమే కాదు – ప్రజాస్వామ్య వాదులను విస్మయానికి గురిచేసింది.  ది హిందూ ఇలా విలువల వలువలను ఊడదీసుకొని నడిబాజారులో నిలిచినప్పుడే -  మిగిలిన చోటా మోటా పత్రికల గురించి రాయటానికి ఏముంటుంది.


ఎల్లో మీడియా ఇన్ ఏపి ఈజ్ నౌ ఇన్ అపోజిషన్ – అనేలా - టిడిపి & ఇట్స్ అపెక్స్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే క్రెడిబిలిటీ కోల్పోయారు. నేషనల్ మీడియను కూడా ఇంత సులువుగా సునాయాసంగా ఆయాసం లేకుండా తమ నియంత్రణలోకి తెచ్చుకోవటానికి - కీర్తి, కాంత, కనకాలను ఎంతగా ఎరవేసి  దుర్వినియోగం చేసి ఉంటారో!  అని జన బాహుళ్యం చలోక్తులు విసురుకుంటుంది.  


ఐదుకొట్ల ప్రజానీకం అత్యద్భుతంగా తమ మాండేట్ ద్వారా యిచ్చిన ఆధిఖ్యతను తమ తప్పుడు రాతలతో ఒక క్రెడిబిలిటీ కోల్పోయిన పార్టీని దానిని, స్వంతం చేసుకున్న ఒక సామాజిక వర్గ మీడియా ప్రత్యేకించి పనిగట్టుకొని మార్చేయాలనుకోవటం - ప్రజాస్వామ్యాన్ని పరిహసించటం క్షమార్హం కాదని జనం నిర్ణయించుకున్న దశలో నేషనల్ మీడియా వ్యవహారం జనాన్ని ఆశ్చర్య చకితులను చేస్తుంది. 


ప్రజాస్వామ్య హననం అనేది ఎప్పటికి జరగని పని - ఎందుకంటే వైసీపి సాధించింది మామూలు విజయం కాదు దిగ్విజయం. ఎన్నికలలో జైత్రయాత్రగా అభివర్ణించదగ్గ ప్రజాభిప్రాయం అదే ఔన్నత్యంలో వర్ధిల్లాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మొహనరెడ్డి తన పాలన ద్వారా ఋజువు చేసుకోవలసి ఉంది.


ఒక సంవత్సరకాలం కనీసం ఆరు నెలలైనా ప్రాంతీయ మీడియా అయినా, జాతీయ మీడియా అయినా నిరీక్షించాల్సిందే. అలా కాకుండా ఇప్పుడే వైఎస్ జగన్మోహన రెడ్డిని పదవికి రాజీనామా చేయాలని అలజడి రేప ప్రయత్నించే సిగ్గుమాలిన ప్రతిప ప్రతిపక్షానికి అనవరతమూ వంతపాడుతూ - 24 * 7 ప్రచారం చేసే ఒక సామాజికవర్గ ప్రాంతీయ మీడియాలాగే - జాతీయ మీడియా ప్రవర్తించిందంటే చేతులు మారిన ప్రయోజనాల విలువలను బయటకు లాగాల్సిందేనని - లేకపోతే జాతీయ మీడియాకు తప్పుడు రాతలు రాయాల్సిన పనేమిటని జనం ప్రశ్నిస్తున్నారు.


ఈ ఆంగ్ల పత్రికలలో వచ్చిన వివిధ సంపాదకీయాలు, కదానాలు, వ్యాఖ్యలు చూసిన తర్వాత ఒక విషయం అర్దం అయింది. వాళ్ళు కూడా మేనేజబుల్ – అని ప్రలోబాల కు పడిపోయే ప్రాంతీయ మీడియా లెక్కేనని అర్ధం అవుతుంది - లేదా వారు కూడా  తెలివితక్కువగా వల్లో పడిపోతారనే సంగతి స్పష్టం అవుతుంది. ముఖ్యమంత్రి, ప్రభుత్వ విదానాలపై వ్యాఖ్యానించడం అదీ ఏకపక్షంగా ఇష్టం వచ్చినట్లు అవాస్తవాలతో కదనాలు ఇచ్చాయంటే వారు ఎంత తేలికగా మేనేజ్ అవుతారో? ఆన్న ఆలోచన కలుగుతుంది.


తెలుగుదేశంకు మద్దతు ఇవ్వటానికే పుట్టిందన్నట్లు పనిచేసే 'ప్రముఖ మీడియ' ఆత్మకూరుపై టిడిపి రాజకీయం అంతా ముగిసిన తర్వాత అది కూరలో కరేపాకులాగా చిన్న కుటుంబ గొడవ అనిచెపుతూ - దానికి రాజకీయ రంగు పులుముకొందని ఉటంకిస్తూ ముక్తాయింపు కదనాన్ని ప్రచురించింది. అసలు విషయాన్ని ప్రతిపక్షం రభస చేస్తు రాష్ట్రాన్ని అతలాకుతలం చేయ ప్రయత్నించిన తరుణాన కూడా ఏందుకు ప్రచురించలేదనేది - అర్దం చేసుకోలేనత అమాయకులు కాదు తెలుగు జనావళి.


ఈ పచ్చ ప్రాంతీయ మీడియా ప్రతిపక్షానికి మద్దతు ఇవ్వడం మాత్రమే కాదు, తానే  ప్రతిపక్షమైనట్లు ప్రభుత్వానికి తానే ప్రత్యర్దులన్నట్లు వ్యవహరిస్తూ చేసే, యాగీ అంతా ఇంతా కాదు. ఇది అత్యంత విచారకరం మాత్రమేకాదు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నట్లే కదా!  పత్రికా విలువలు పత్రికా ప్రమాణాలను అనుక్షణం ఉద్భోదించే మీడియాపై ఏహ్య భావన కలుగుతుంది. గత ప్రభుత్వకాలంలో ఎన్ని అరాచకాలు జరిగినా కప్పిపుచ్చడానికే  ఈ సామాజిక వర్గ మీడియా ప్రయత్నించిందని అర్ధం చేసుకున్న ప్రజలు టిడిపికి వ్యతిరేఖంగా కట్టకట్టుకున్నారా?! అనేలా దారుణంగా ఓటమికి గురి చేశారు.


ఎందుకంటే ఈ ఎల్లో మీడియా మాయాజాలాన్ని కూడా మరో ప్రక్క సోషల్ మీడియా జనం వాస్తవాలు తెలుసుకునేలా కదనాలు విసుగు విరామం లేకుండా ప్రచారం చేసింది. ఇప్పుడు జాతీయ మీడియా అమరావతి గురించి, పోలవరం గురించి - చంద్రబాబు నిర్భందం గురించి - వ్యాఖ్యానాలు వండి వార్చినంత మాత్రాన నిజం అబద్ధమై పోదు కదా! ఆ మీడియాపై ఉండే గౌరవమే పోయి, ఇలా కథనాలు సోషల్ మీడియా వేదికగా రాసుకోవలసి వస్తుంది. 


ఇక మీడియాకు స్వేచ్చ అంటారా! స్వేచ్చ అవసరమెంతో దానికి బాద్యత వహించటమూ అంతే. మీడియాకు ముఖ్యంగా పాలకుడేవరనే ఆలోచనకన్నా, పాలన ఎలా ఉందన్న జిఙ్జాస ఉండాలి. పాలకుడు చంద్రబాబైనా, ఆయన బాబైనా, జగన్ అయినా సమాన ప్రాధాన్యం యివ్వాలన్న విషయం  మీడియా గ్రహించాలి అప్పుడు అంతా ప్రజస్వామ్యం బద్ధంగానే కొనసాగుతుందని చెప్పవచ్చు. జగన్మోహనరెడ్డి ఆయన పాలనపై నిఘా ఉంచకూడని చెప్పటం ఈ వ్యాసం, వ్యాసకర్త ఉద్దేశం ఏ మాత్రం కాదు. నిక్కచ్చిగా నిఘా ఉండవలసిందే కాని మీడియా పక్షపాతం క్షమార్హం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: