సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి మొవ్వా కృష్ణబాబుకు మరో పోస్టు దక్కింది. రవాణా, రోడ్లు మరియు భవనాలశాఖ కార్యదర్శిగా పనిచేస్తోన్న కృష్ణబాబు ఆర్టీసీ ఎండిగా ప్రభుత్వ అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఆర్టీసీ ఎండిగా ఉన్న సురేంద్రబాబును తప్పించి..ఆయన స్థానంలో కృష్ణబాబుకు బాధ్యతలు అప్పచెప్పడం..సచివాలయ వర్గాల్లో చర్చకు కారణమైంది. నిజాయితీ, సమర్థత కలిగిన అధికారిగా సురేంద్రబాబుకు పేరున్నా...ప్రభుత్వ పెద్దల మాటను పాటించలేదనే కారణంతో ఆయనను తప్పించారని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ఆయన స్థానంలో 'సురేంద్రబాబు సామాజికవర్గానికే చెందిన కృష్ణబాబును నియమించడం కూడా చర్చనీయాంశమైంది. ఒకే సామాజికవర్గానికి చెందిన వారిలో ఒకరిని తప్పించి...మరొకరిని ఆ పోస్టులో నియమించడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి.



అయితే కృష్ణబాబును ఆర్టీసీ ఎండిగా ఎందుకు నియమించారు.  ఆయన సమర్థత చూశా.. లేక..ఆయన విధేయత చూశా.  దీనిపై ఐఎఎస్‌ వర్గాల్లో చర్చ సాగుతోంది. సమర్థత, నిజాయితీ కన్నా...విధేయతకే జగన్‌ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందంటున్నారు. కృష్ణబాబు  మొదటి నుంచి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధాలను నెరుపుతున్నారు. స్వర్గీయ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కడప జిల్లా కలెక్టర్‌గా సుధీర్ఘకాలం పనిచేశారు. తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన కృష్ణబాబు ను తన స్వంత జిల్లాల్లో రాజశేఖర్‌రెడ్డి కలెక్టర్‌గా నియమించుకోవడం అప్పట్లో రాజకీయ, అధికార వర్గాలను ఆకర్షించింది.



తరువాత కాలంలో కృష్ణబాబు వివిధశాఖల్లో పనిచేసినా..2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖపోర్టు ఛైర్మన్‌గా వెళ్లిపోయారు. తన సామాజికవర్గానికి చెందిన అధికారి అయినప్పటికీ 'చంద్రబాబు' ఆయనకు ప్రాధాన్యత ఇవ్వలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. చంద్రబాబు అంతా తన సామాజికవర్గానికి చెందిన వారినే నియమించుకుంటున్నారని, వారే అంతా దోచుకున్నారని 'జగన్‌'తో సహా ఆయన పార్టీ నాయకులు మొన్నటి వరకు ఆరోపించారు. అయితే చంద్రబాబు హయాంలో తన స్వంత సామాజికవర్గ ఐఎఎస్‌ అధికారులకు ఆయనేమీ ప్రాధాన్యత ఇవ్వలేదు. స్వంత సామాజికవర్గానికి చెందిన సీనియర్‌ అధికారులను కూడా ఆయన అంచనాల మేరకు పనిచేయకపోతే పక్కన పెట్టారు.




నిజాయితీ కలిగినా, సమర్థత ఉన్నా..ఆయన పట్టించుకోలేదు. అదే విధంగా కృష్ణబాబు విషయంలో కూడా చంద్రబాబు వ్యవహరించారు. ఆయన ఐదేళ్ల కాలంలో కృష్ణబాబు ఎక్కడా ఫోకస్‌కాలేదు. వై.ఎస్‌.జగన్‌ ముఖ్యమంత్రి కావడంతోనే 'కృష్ణబాబు' క్రియాశీలకమైన పోస్టులోకి వచ్చారు. మొదట ఆయన సిఎంఒలోకి వెళతారని ప్రచారం జరిగినా..ఎందుకో అది వర్కట్‌ కాలేదు. అయితే అత్యంత ప్రాధాన్యత కలిగిన 'రవాణా, రోడ్లు, భవనాలశాఖ కార్యదర్శి పదవికి ఆయనను జగన్‌ ఎంపిక చేశారు. తాజాగా...ఆర్టీసీ ఎండిగా కూడా నియమించారు. మొత్తం మీద..చూసుకుంటే తన తండ్రి హయాంలో కీలకంగా పనిచేసి, తన తండ్రికి విధేయుడిగా ఉండడం, చంద్రబాబు ప్రభుత్వంలో కీలకంగా పనిచేయకపోవడం వల్లే కృష్ణబాబుకు ఇప్పుడు మరో పోస్టు దక్కిందని సచివాలయ వర్గాలు చెప్పుకుంటున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: