సింగరేణి పేరు చెప్పగానే మనకు తెలంగాణలోని బొగ్గుగనుల గుర్తుకు వస్తాయి.  తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో ఈ గనులు అధికసంఖ్యలో ఉన్నాయనే సంగతి తెలుసు.  ఎన్నో సంవత్సరాలుగా బొగ్గును తెలంగాణ నుంచి ఉత్పత్తి చేస్తున్నారు.  అయితే, భూమి పైపొరల్లో బొగ్గు తగ్గిపోవడంతో లోపలి నుంచి బొగ్గును బయటకు తీసుకురావడానికి చాలా ఖర్చు అవుతున్నది.  ప్రస్తుతం సింగరేణిలో ఒక టన్ను బొగ్గు ఉత్పత్తికి రెండువేల రూపాయల వ్యయం అవుతున్నది.  ఇది ఎక్కువనే చెప్పాలి.  


ప్రస్తుతం సింగరేణి వద్ద 48 బొగ్గుగనుల ఉన్నాయి.  వీటి నుంచి ఏడాదికి 680 లక్షల టన్నులు బొగ్గును వెలికి తీస్తున్నది.  అయితే, ఇక్కడ వ్యయం పెరిగిపోతుండటంతో సింగరేణి సంస్థ కొత్త బొగ్గుగనులపై దృష్టి పెట్టింది.  సింగరేణి సంస్థకు కేంద్రం సిరులు కురిపించే వార్తను చెప్పింది. ఒడిశాలోని చండీపడ తహశీల్ ప్రాంతంలో ఉన్న న్యూపాత్రపాద అనే పేరుతో ఉన్న బొగ్గుగనులను కేటాయించింది.  మొత్తం మూడు బ్లాకులున్న ఈ బొగ్గు గనులను కేంద్రం సింగరేణికి అప్పగించింది. 


ఇది నైని అనే బొగ్గుగనికి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం విశేషం.  మూడు బ్లాకుల్లో మొదటి బ్లాక్ తవ్వకాలకు అన్ని రకాల అనుమతులు వచ్చాయి.  2021 నుంచి నైని బొగ్గుగనుల్లో సింగరేణి సంస్థ బొగ్గును ఉత్పత్తి చేయబోతున్నది.  న్యూ పాత్రపాద బొగ్గుగనుల కూడా సింగరేణి సొంతం కావడం విశేషం.  త్వరలోనే అక్కడ కూడా బొగ్గును ఉత్పత్తి చేస్తుందట సింగరేణి.  3108 హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న మొదటి బ్లాక్ లో పెద్ద ఎత్తున అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి.  అక్కడ తవ్వకాలు మొదలుపెడితే ఏడాదికి 200 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చెయ్యొచ్చు.  


ఇది సింగరేణికి వరమని చెప్పాలి.  సింగరేణిని మరింత లాభాల్లోకి తీసుకెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుంది.  మరో యాభై సంవత్సరాల పాటు బొగ్గు ఉత్పత్తితో సింగరేణిని లాభాల బాట పట్టించవచ్చని సింగరేణి యాజమాన్యం చెప్తోంది.  న్యూ పాత్రపద ప్రాంతంలో మొత్తం ఆరు బ్లాకుల్లో బొగ్గు నిల్వలు ఉన్నట్టు కేంద్రం గుర్తించింది.  అందులో మూడు బ్లాకులు సింగరేణికి కేటాయించింది.  అయితే, ఆరు బ్లాకులు తమకే ఇవ్వాలని సింగరేణి కేంద్రాన్ని కోరుతున్నది.  మరి కేంద్రం అందుకు అంగీకరిస్తుందా చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: