బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు టిడిపి ఫిరాయింపు ఎంపిల విషయంలో ఓ విచిత్రమైన ప్రకటన చేశారు. టిడిపి నుండి బిజెపిలోకి ఫిరాయించిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, సిఎం రమేష్, టిజి వెంకటేష్ బిజెపి భావజాలంతో పనిచేయాలట. ఆర్దిక నేరాల ఆరోపణలను ఎదుర్కొంటున్న వీళ్ళకు అసలు ఓ భావజాలమంటూ ఉంటుందా అన్నదే అందరికీ వస్తున్న సందేహం.

 

దాదాపు రూ. 8 వేల కోట్ల ప్రజాధనాన్ని బ్యాంకుల నుండి కొల్లగొట్టిన సుజనాకు నాంపల్లి కోర్టు ఏకంగా అరెస్టు వారెంటే జారీచేసింది. ఏదో కేంద్రమంత్రిగా ఉన్నారు కాబట్టి చచ్చీచెడీ అరెస్టు వారెంటును  కోర్టు నుండి ఉపసంహరింప చేసుకున్నారు. ఈయనపై చంద్రబాబునాయుడు బినామీ అనే ముద్రుంది.

 

సిఎం రమేష్ గురించి తీసుకున్నా ఈయనపైనా తీవ్రమైన ఆర్దిక ఆరోపణలున్నాయి. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ అంచనాలు పెంచేసి వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారనే ఆరోపణలున్నాయి. విచిత్రమేమిటంటే ఈయన దోపిడి మీద బిజెపి నేతలే విస్తృతంగా అధ్యయనం చేసి కేంద్రానికి ఓ రిపోర్టు కూడా పంపారు లేండి. ఈయన మీద కూడా చంద్రబాబు బినామీ అనే ప్రచారముంది.

 

టిజి వెంకటేష్ సంగతి సరే సరే. వ్యాపార విస్తరణ పేరుతో బ్యాంకుల నుండి అప్పులు తీసుకుని ఎగ్గొట్టారనే ఆరోపణలున్నాయి. ఈయనపై చంద్రబాబు బినామీ ముద్ర లేకపోయినా ఈయనదంతా క్యాష్ అండ్ క్యారీ రాజకీయమనే ప్రచారం ఉంది. ఇటువంటి వాళ్ళను బిజెపి చేర్చుకోవటమే అసలు విచిత్రం.

 

తన రాజకీయ అవసరాల కోసం చంద్రబాబే వీళ్ళను బిజెపిలోకి పంపారనే ప్రచారం అందరికీ తెలిసిందే.  ఆర్ధిక నేరాల ఆరోపణలను ఎదుర్కొంటున్న వాళ్ళను చేర్చుకోవటమే కాకుండా వీళ్ళంతా బిజెపి భావజాలంతోనే పనిచేయాలని జివిఎల్ చెప్పటమే విచిత్రంగా ఉంది. పైగా ఓ వైపు నరేంద్రమోడి, అమిత్ షా నుండి అందరూ ఫిరాయింపులను బహిరంగంగా ప్రోత్సహిస్తున్నారు. ఏదో వాజ్ పేయ్, ఎల్ కె అద్వానీ కాలంలో బిజెపి భావజాలమంటే అర్ధముంది కానీ ఇపుడే భావజాలముందో ?


మరింత సమాచారం తెలుసుకోండి: