తెలుగుదేశం పార్టీలో అతి పెద్ద ముసలం పుడుతోంది. ఆ పార్టీకి బలమైన నాయకులుగా ఉన్న వారంతా ఒక్కసారిగా గుడ్ బై చెప్పేస్తున్నారు. కంచుకోటను మంచుకోటగా మార్చేస్తూ పార్టీ జెండాను పీకేసేందుకు రెడీ అవుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలను చూసుకుని ఇన్నాళ్ళూ ధీమాగా ఉన్న టీడీపీకి ఇది మింగుడుపడని పరిణామమే. అక్టోబర్లో విశాఖలో రెండు రోజుల టూర్ కి వస్తున్న చంద్రబాబుకు అంతకు ముందే బిగ్ బాంబు వేసేందుకు తమ్ముళ్ళు రెడీ అయిపోయారు.


విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన బ్యాచ్ తో సహా టీడీపీని వీడి వైసీపీలోకి చేరనున్నారు. ఈ మేరకు ఆయనకు ముఖ్యమంత్రి జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. గంటా విశాఖ ఉత్తరం నుంచి ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే నాటి నుంచి ఆయన పార్టీకి పెద్దగా టచ్ లో లేకుండా ఉన్నారు. గంటా అంటీ ముట్టనట్లుగా ఉన్న వైఖరిని చూసిన వారంతా ఆయన పార్టీ మారడం ఖాయమని భావించారు.


దానికి తగినట్లుగానే గంటా కదలికలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇదిలా ఉండగా గంటా అక్టోబర్ 2న ముహూర్తం పెట్టుకుని మరీ వైసీపీలోకి మారుతున్నారన్న వార్తలు ఇపుడు జిల్లాలో గుప్పుమంటున్నాయి. గంటా ఒక్కరే కాకుండా ఆయన్ని అనుసరించే బడా నాయకులు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీని వీడతారని ప్రచారం సాగుతోంది. వారిలో విజయనగరం పట్టణ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే నాయుడు, చీపురుపల్లికి చెందిన మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత ఒకరు కూడా పార్టీని వీడుతారని అంటున్నారు. ఇక మరికొందరు గంటా వర్గం నాయకులు కూడా సంప్రదింపుల  దశలో ఉన్నారని అంటున్నారు.


అన్నీ అనుకున్నట్లుగా జరిగితే టీడీపీ నుంచి అతి పెద్ద బ్యాచ్ వైసీపీలోకి జంప్ అవడం ఖాయమని చెబుతున్నారు. మరి ఈ కీలకమైన రాజకీయ  పరిణామాలు ఏ మలుపు తీసుకుంటాయో టీడీపీ కోలుకుంటుందా లేదా అన్నది కూడా జిల్లాలో అతి పెద్ద   చర్చగా ఉంది. ఇదిలా ఉండగా గంటా తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారని గట్టిగా వినిపిస్తోంది. అదే జరిగితే అసెంబ్లీలో టీడీపీ బలం మరింత తగ్గుతుంది. ఇక వైసీపీలోకి వెళ్ళే నాయకులకు కూడా గంటా కొత్త దారి చూపించిన వారు అవుతారని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: