అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి..పార్లమెంటు ఎన్నిక‌ల్లో కాస్త తెరిపిన ప‌డ్డ‌ తెలంగాణ కాంగ్రెస్‌కి మరో షాక్ ఇచ్చేలా కాంగ్రెస్ కీలక నేత అధికార టీఆర్ఎస్‌లో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అజారుద్దీన్‌ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్‌సీఏ) అధ్యక్ష ఎన్నికల్లో మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఘన విజయం సాధించారు. త‌న గెలుపు కోసం కృషిచేసిన టీఆర్ఎస్‌లో చేరేందుకు ఆయ‌న రంగం సిద్ధం చేసుకున్న‌ట్లు స‌మాచారం.


హెచ్‌సీఏ ఎన్నికల్లో అజారుద్దీన్‌తో పాటు ప్రకాశ్ చంద్ జైన్, దిలీప్ కుమార్ అధ్యక్ష బరిలో నిలిచారు. 227 ఓట్లకు గాను 223 ఓట్లు పోలయ్యాయి. అజారుద్దీన్ 147, ప్రకాశ్ జైన్ 73, దిలీప్ కుమార్‌కు 3 ఓట్లు వచ్చాయి. 74 ఓట్ల తేడాతో అజారుద్దీన్ ఘన విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్‌గా అజార్ ప్యానెల్‌కు చెందిన జాన్ మనోజ్ విజయం సాధించారు. 49 ఓట్ల ఆధిక్యంతో హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడిగా మనోజ్ గెలుపొందారు. ఈ గెలుపు కోసం మంత్రి కేటీఆర్ పావులు క‌దిపిన‌ట్లు స‌మాచారం. కాగా, శ‌నివారం అజారుద్దీన్ టీఆర్ఎస్‌లో చేర‌నున్న‌ట్లు స‌మాచారం. టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌ను ఈ రోజు సాయంత్రం ప్రగతి భవన్‌లో అజారుద్దీన్ క‌లిసిన‌ట్లు తెలుస్తోంది. అజారుద్దీన్ గెలుపుకు విశేష కృషి చేసిన కేటీఆర్‌తో క‌లిసి ఈ స‌మావేశం జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది.


కాగా, కొద్దికాలం క్రితం ఇటీవల ఓ ఎంపీ కూతురి పెళ్లిలో టీఆర్‌ఎస్‌ కీలక నేతలతో అజార్ చర్చలు జరిపారని ప్ర‌చారం జ‌రిగింది. అజారుద్దీన్‌ను పార్టీలోకి తీసుకొని సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్‌ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు ఆ ఎంపీ విజ్ఞప్తి చేసినట్టు వార్తలొచ్చాయి. అయితే, అది నిజం కాలేదు. ప్ర‌స్తుత ప్ర‌చారంపై ఇటు అజార్‌...అటు టీఆర్ఎస్ త‌ర‌ఫున అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: