జలమండలి రెవెన్యూలో స్వయం సమృద్ది సాధించాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  కె. తారక రామారావు  తెలిపారు. శుక్రవారం  బుద్దభవన్ లో జలమండలి ఉన్నతాధికారులతో బోర్డు రెవెన్యూ, ప్రాజెక్టు, నీటి సంరక్షణ, మంచినీటి సరఫరా , రెవెన్యూ పెంపు వంటి వాటిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంలో ప్రతి ఒక్కరికి సంతృప్తికర స్థాయిలో మంచినీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఇంతటితో ఆగకుండా నిరంతరం నీటి సరఫరా చేసేందుకు ప్రభుత్వం, జలమండలి కృషి చేస్తుందని వివరించారు. జలమండలి పైపులైను వ్యవస్థకు సంబంధించిన నూతన జీఐఎస్ మ్యాపింగ్ వ్యవస్థను రూపొందించాలని సూచించారు. ఈ మ్యాపింగ్ లో ప్రస్తుతం ఎక్కడెక్కడ జలమండలి పైపులైను వ్యవస్థ, సెవరెజీ వ్యవస్థ, మ్యాన్ హోళ్లు వంటి వాటిని పొందుపర్చాలని తెలిపారు. పైపులైను లేని చోట దశల వారీగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తామన్నారు.



దేశంలో ఎక్కడలేని విధంగా మిని జెట్టింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చి దేశంలోని ఇతర మహానగరాలకు ఆదర్శంగా జలమండలి నిలిచినట్లు తెలిపారు. పారిశుద్య కార్మికులు మ్యాన్ హోళ్లలోకి దిగకుండా జలమండలి చర్యలు తీసుకోవడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. ప్రైవేటు కాంట్రాక్టర్లు ఎవరైనా కార్మికులను మ్యాన్ హోళ్లలోకి దింపితే సదరు కాంట్రాక్టరుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జలమండలి పైపులైను వ్యవస్థ నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ ఉన్న వారిని గుర్తించేందుకు, కమర్షియల్ కనెక్షన్లకు గుర్తించేందుకు విజిలెన్స్  మరియు ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం పటిష్ట పరచాల్సిన అవసరముందన్నారు. ఇందుకోసం పోలీసు శాఖ నుంచి అవసరం మేరకు అధికారులు, సిబ్బందిని జలమండలికి కేటాయించనున్నట్లు తెలిపారు. కమర్షియల్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలన్నారు.  జలమండలి రెవెన్యూ పెంచేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు.



జలమండలి లెక్కలోకి రాకుండా పోతున్న నీటిని తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. నగర శివారుల్లో పరిశ్రమలు వెలుస్తున్న జలమండలి ఇండస్ట్రీయల్ కనెక్షన్లు తగ్గడం వెనుక ఉన్న కారణాలను అన్వేషించాలని సూచించారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ, విద్యుత్, ఐలా వారి సమన్వయంతో ఇండస్ట్రీయల్, కమర్షియల్ కనెక్షన్లను గుర్తించాలని ఆదేశించారు.  ప్రభుత్వం నూతన మున్సిపాలిటీల్లో చేపడుతున్న వాటర్ ఆడిటింగ్ ను జలమండలి వాటర్ ఆడిటింగ్ చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ . అర్వింద్ కుమార్, జలమండలి ఎండీ ఎం. దానకిషోర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. ఎం. సత్యనారాయణ, పలువురు డైరెక్టర్లు, సీజీఎమ్ లు  పాల్గొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: