హుజూర్ నగర్ ఉప ఎన్నికలు  కాంగ్రెస్ పార్టీకి చావో రేవోనేనా? అధికార పార్టీని ఎదుర్కోవడానికి అన్ని అస్త్రాలను హస్తం పార్టీ సిద్ధం చేసుకుంటుందా?  పీసీసీ చీఫ్ ఉత్తమ్ సొంత నియోజకవర్గం... దానికి తోడు అభ్యర్థి ఆయన సతీమణి పద్మావతి కావడంతో కాంగ్రెస్‌కు ఉపఎన్నిక గట్టి సవాల్ గా మారిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నాయి పార్టీ వర్గాలు. 


హుజూర్ నగర్ ఉప ఎన్నిక అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. మొన్నటి అసెంబ్లీ, లోక్‌ సభ ఎన్నికల్లో అధికారపార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. 16స్థానాలు తమవేనని చెప్పుకున్న టీఆర్ఎస్ కు తొమ్మిదే దక్కాయి. బీజేపీ తెలంగాణలో దూకుడు పెంచింది. కాంగ్రెస్ కు పార్లమెంట్ ఫలితాలు ఊరట నిచ్చాయి. ఈ నేపథ్యంలో వచ్చిన హుజూర్ నగర్ ఉప ఎన్నికను అందివచ్చిన అవకాశంగా చూస్తుంది అధికార పార్టీ. ఇక్కడ విజయం సాధించి తెలంగాణలో టీఆర్ఎస్ కి తిరుగులేదని చాటా చెప్పాలనుకుంటోంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేసిన ఈ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకుని విమర్శకుల నోళ్లు మూయించాలన్న కసితో పనిచేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది టీఆర్ఎస్.


కాంగ్రెస్ కు హుజూర్ నగర్ లో గెలుపు అనివార్యంగా మారింది.  అయితే  గెలుపు... హస్తం పార్టీకి ఓ ఛాలెంజ్ గా కాంగ్రెస్ శ్రేణులు విశ్లేషిస్తున్నాయి. ఉత్తమ్ సైతం సవాల్ గా తీసుకుని పనిచేస్తున్నారు. హుజూర్ నగర్ ఆయన సిట్టింగ్‌ స్థానం. ఎంపీగా గెలిచిన ఉత్తమ్ రాజీనామా చేయడం వల్ల ఉపఎన్నిక వచ్చింది. పైగా పీసీసీ సారథిగా ఉన్నారు ఉత్తమ్‌. తెలంగాణలో కాంగ్రెస్ రోజురోజుకు బలహీనపడి, బీజేపీ బలపడుతోందన్న చర్చ నడుస్తున్న నేపథ్యంలో హుజూర్ నగర్ లో గెలిచి ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తోంది కాంగ్రెస్‌. 


ఉప ఎన్నికల వేడి రాజుకోవడంతోపాటు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్‌ఎస్‌ గెలిస్తే ప్రజలకు మేలంటున్న అధికార పార్టీ.. కాంగ్రెస్‌ గెలవడం వల్ల ఉత్తమ్‌ కే మేలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు నియోజకవర్గాన్ని హీటెక్కించాయి. అయితే కాంగ్రెస్‌ కూడా విమర్శల జోరు పెంచింది. టీఆర్‌ఎస్‌ గెలిస్తే వందలో ఒకటవుతాడు.. కాంగ్రెస్‌ గెలిస్తే ప్రజల పక్షాన కొట్లాడతారు అని అటాక్‌ చేస్తోంది. ఉత్తమ్‌ చేసిన అభివృద్ధితోపాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారాస్త్రాలుగా మలిచింది కాంగ్రెస్‌. రుణమాఫీ, రైతు బంధు, నిరుద్యోగ సమస్య, ఉద్యోగులపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను తమ ప్రసంగాలలో ప్రస్తావిస్తున్నారు హస్తం పార్టీ నేతలు. రాజకీయ  పార్టీలు, నేతల మధ్య విమర్శలు ఎలా ఉన్నా.. కాంగ్రెస్‌ పార్టీకి మాత్రం హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక కీలకంగా మారింది. పార్టీ ప్రతిష్ఠ ఈ ఎన్నికలతో ముడిపడి ఉండటంతో నేతలంతా చెమటోడుస్తున్నారు. మరి ఓటర్లు ఎలాంటి తీర్పు చెబుతారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: