తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక  వేడి రోజుకింత రాజుకుంటోంది .  రాజకీయ పార్టీలు ఇప్పటికే  పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.  హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలే కాకుండా,  సర్పంచులు,  న్యాయవాదులు పోటీ చేయాలని నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది.  సర్పంచులు పోటీ చేయడం వల్ల ఎవరికీ ఎక్కువ నష్టం అన్న చర్చ సర్వత్రా కొనసాగుతోంది.  హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో 251 మంది అభ్యర్థులు సర్పంచ్ ల సంఘం  తరపున నామినేషన్లు దాఖలు చేయనున్నారని రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూమన్న యాదవ్ తెలిపారు.


 సర్పంచులకు,  ఉప సర్పంచ్ లకు జాయింట్  చెక్ పవర్ ఇవ్వడాన్ని సర్పంచుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది .  అలాగే పంచాయితీలకు  నిధుల విడుదల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని తీవ్రంగా నిరసిస్తోంది .  ప్రభుత్వ వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలని ఉద్దేశ్యం తోనే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో 251 మంది సర్పంచులం   నామినేషన్లను దాఖలు చేయాలని నిర్ణయించామని భూమన్న యాదవ్ తెలిపారు . నియోజకవర్గ పరిధిలోని   ప్రతి గ్రామంలో తిరిగి టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామన్న భూమన్న యాదవ్ వ్యాఖ్యలు పరిశీలిస్తే , ఉప ఎన్నికలో సర్పంచ్ లు పెద్ద సంఖ్య లో పోటీ చేయడం వల్ల అధికార  పార్టీకి ఎంతో, కొంత ప్రతికూలంగా మారే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది .


  ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ  స్థానం లో  కూడా రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. రైతులు పెద్ద సంఖ్య లో పోటీ చేయడం వల్ల ఆ స్థానం లో టీఆరెస్ అభ్యర్థి కవిత ఓటమి పాలయిందన్న వాదనలు లేకపోలేదు .  ఇప్పుడు సర్పంచులు హుజూర్ నగర్  ఉప ఎన్నికల్లో పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించడం పరిశీలిస్తే అధికార టీఆర్ఎస్ కు రాజకీయంగా ఇబ్బందులు తప్పకపోవచ్చుననే వాదనలు రాజకీయ వర్గాల్లో విన్పిస్తున్నాయి . ఇక న్యాయవాదులు కూడా ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించుకోవడం అధికార పార్టీ వర్గాల్లో గుబులు రేపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: