కొన్ని రోజుల క్రితం గోదావరిలో పాపికొండల్లో ప్రయాణం చేస్తున్న పడవ మునిగిన సంగతి తెలిసిందే.  ఈ పడవ ప్రమాదంలో దాదాపుగా 40 మంది వరకు మరణించారు.  గోదావరికి వరదపోటు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇలా పడవను ఎలా అనుమతించారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  ప్రజలతో పాటుగా అటు ప్రతిపక్షం కూడా ప్రశ్నిస్తోంది.  దీనికి పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని తెలుగుదేశంపార్టీ నేత మంతెన సత్యన్నారాయణ రాజు డిమాండ్ చేస్తున్నారు. 


గోదావరిలో పడవ ప్రమాదానికి కారణమైన మంత్రి అవంతి శ్రీనివాస్‌ పర్యాటకాభివృద్ధికి సంబంధించిన అవార్డు తీసుకోవడానికి సిగ్గుపడాలి. పడవ మునిగి దాదాపు 15 రోజులవుతున్నా బయటకు తీయకుండా రాజకీయ విమర్శలు చేయడం అవంతి దిగజారుడుతనానికి నిదర్శనం. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం తరఫున అవార్డు తీసుకోవడం శోచనీయం. వైసీపీ నాలుగు నెలల పాలనలో పర్యాటకంపై ఒక్కటంటే ఒక్క సమీక్ష గానీ, అభివృద్ధిగానీ చేయకుండా.. అవార్డు ఎలా వచ్చిందో, ఎవరు చేసిన కృషికి అవార్డు వచ్చిందో ఆలోచించుకోవాలని అన్నారు.  


నోరు తెరిస్తే అబద్దం మాట్లాడుతున్న అవంతి శ్రీనివాస్‌ ఇప్పుడు తీసుకున్న అవార్డుతో తెలుగుదేశం ప్రభుత్వ అభివృద్ధిని ఢిల్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. తెలుగుదేశం హయాంలో అసలేం చేయలేదు అంటూ మొన్నటికి మొన్న విమర్శించారు. ఇప్పుడు ఆయన శాఖ దేశంలోనే నెంబర్‌ వన్‌ అంటూ కేంద్రం ఇచ్చిన అవార్డును అందుకున్నారు. మంత్రిగారూ తెలుగుదేశం హయాంలో పర్యాటకరంగంలో జరిగిన అభివృద్ధిని, మీ చేతగానితనాన్ని ఇప్పటికైనా ఒప్పుకోండి. చేతకాని వారికే చేష్టలెక్కువ అన్నట్లు.. పర్యాటకానికి తెలుగుదేశం చొరవేంటో తెలుసు గనకే అవార్డుల స్వీకారం నాడు.. అధికారులు కనీసం అవార్డును ముట్టుకోనీయకుండా అడ్డుకున్నారు. ఇదెక్కడి సంస్కృతో అవంతికే తెలియాలి. నవ్వుతూ.. నమ్మించి మోసం చేయడంలో జగన్‌ను అవంతి మించిపోయారని అయన పేర్కొన్నారు.  విశాఖలో వాక్‌ స్వాతంత్రాన్ని హరిస్తూ అక్రమ కేసులు పెట్టడం మాని.. గోదావరిలో మునిగిన పడవను బయటకు తీయడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.  మరి అవంతి శ్రీనివాస్ ఈ మాటలను ఎలా తీసుకుంటారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: