మాజీ మంత్రి, కర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ఓడిపోయిన భూమా అఖిల ప్రియారెడ్డి.. దూకుడు పెంచారా?  అధికారుల‌పై దూష‌ణల ప‌ర్వంతో ఇటీవ‌ల కాలంలో వార్త‌ల్లోకి ఎక్కిన అఖిల ప్రియా.. తాజాగా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేసుకున్నారు. కొన్నాళ్ల కింద‌ట టీడీపీ అధినేత చంద్ర‌బాబు పిలుపు ఇచ్చిన చ‌లో ఆత్మ‌కూరు కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వ‌చ్చిన ఆమెను పోలీసులు హోట‌ల్‌లోనే నిర్బంధించారు. ఈ క్ర‌మంలోనే ఆమె పోలీసుల‌తో వాగ్యుద్ధానికి దిగారు. అప్ప‌ట్లో ఇది కూడా వార్త‌ల్లో ప్ర‌ముఖంగా నిలిచింది. ఇక‌, ఇప్పుడు త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని కొన్ని గ్రామాల్లో యురేనియం త‌వ్వ‌కాల కోసం కేంద్ర ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చిన అధికారులు స‌ర్వే చేప‌ట్టారు.


ఈ క్ర‌మంలోనే కొన్ని రోజులు అధికారులు రావ‌డం స‌ర్వేలు చేప‌ట్ట‌డం చేస్తున్నారు. అయితే, తాజాగా ఆయా ప్రాంతంలో ప‌ర్య‌టించిన అఖిల ప్రియ‌, అధికారుల‌పైనా, అధికార పార్టీపైనా చిందులు తొక్కారు. ఎటువంటి అనుమతులు లేకుండా యాదవాడలో యురేనియం ఖనిజాన్వేషణ చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. యురేనియం కోసం సర్వే చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. యురేనియం వల్ల కడప జిల్లాలో వేలాది మంది అనారోగ్యం పాలయ్యారు.. నీరంతా కలుషితమైంది. ‘సేవ్ నల్లమల... సేవ్ ఆళ్లగడ్డ’ క్యాంపెయిన్ నేటి నుంచే మొదలైంది. గతంలో వైసీపీ నాయకులు యురేనియం తవ్వకాలను వ్యతిరేకించారు. ఇప్పుడు మౌనంగా ఉండడం శోచనీయం.. అసలెందుకు మౌనంగా ఉంటున్నారు..?. అని ప్ర‌శ్నించారు.


అదేస‌మ‌యంలో.. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో యురేనియం ఖనిజాన్వేషణ పనులను ప్రభుత్వం వెంటనే నిలిపి వేయాలి. లేకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తాను అని ప్రభుత్వాన్ని అఖిల హెచ్చరించారు. ఈ కార్యక్ర‌మంలో ఆమె త‌న భ‌ర్త‌తో క‌లిసి పాల్గొన‌డం కూడా గ‌మ‌నార్హం. అంతా బాగానే ఉంది. అయితే, ఎందుకోగానీ.. అఖిల ప్రియ చేప‌డుతున్న ఏ కార్య‌క్ర‌మానికీ తెలుగు దేశం పార్టీకి చెందిన నాయకులు ఎవ‌రూ కూడా హాజ‌రుకావ‌డం లేదు. అఖిల ప్రియ‌కు మ‌ద్ద‌తుగా వినిపిస్తున్న ఒక్క గొంతు కూడా క‌నిపించ‌డం లేదు.. వినిపించ‌డ‌మూ లేదు. నిజానికి ఆమె త‌న నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ సీనియ‌ర్ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు క‌య్యాలు పెట్టుకుంటున్నారు. చిన్నా పెద్దా నాయ‌కుల‌ను కూడా ఆమె తోసిరాజంటున్నారు. దీంతో ఆమె చేస్తున్న ఆ కార్య‌క్ర‌మానికీ పెద్ద‌గా స్పంద‌న ఉండ‌డం లేదు.


ఈ నేప‌థ్యంలో వైసీపీ నాయ‌కులు అఖిల ప్రియ ఉడ‌త ఊపుల‌కు ఎవ‌రూ భ‌య‌ప‌డ‌రు! అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మ‌రి ఆమె ఈ నిజాన్ని ఎప్ప‌టికి తెలుసుకుంటారో చూడాలి. కొస‌మెరుపు ఏంటంటే.. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో.. ఆమె ఓట‌మికి అసంతృప్తులే కార‌కులనేది నిజం అంటున్నారు టీడీపీ నాయ‌కులు. త‌మ‌ను లెక్క‌చేయ‌కుండా అంతా త‌న‌దే పైచేయి అనే అహంకారంతో వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్లే అఖిల ప్రియ‌కు ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయ‌ని చెబుతున్నారు. భూమా నాగిరెడ్డికి కూడా వ్య‌తిరేకులు ఉన్నా.. ఎప్పుడూ ఆయ‌న త‌న‌కంటూ ఓ వ‌ర్గాన్ని మేనేజ్ చేసుకున్నార‌ని, ఇలా ఎప్పుడూ సొంతంగా కుంప‌ట్లు పెట్టుకోలేదని చెబుతున్నారు. ఏదేమైనా.. అఖిల ప్రియ ప‌ట్టు కోల్పోతున్నారనేది వాస్త‌వం.


మరింత సమాచారం తెలుసుకోండి: