రాయలసీమలో హైకోర్టు, రాజధాని ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో ఉద్యమం ఊపందుకుంది. రాజధాని మార్పుపై కొద్ది రోజుల క్రితం మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోశాయి. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు న్యాయం జరగాల్సిందేనని, హైకోర్టు సీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్ వస్తోంది. ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి మొదలు.. కర్నూలులో మంత్రుల మీటింగ్ ను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. ఉద్రిక్తత నెలకొంది. అయితే ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రులు ప్రకటించారు. 

రాయలసీమలో హైకోర్టు పెట్టాలని ఉద్యమం ఉధృతమవుతోంది. పార్టీల మద్దతు లేకున్నా.. విద్యార్థి సంఘాలే ఆందోళనకు దిగుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడించారు. మంత్రుల కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కర్నూలులో నలుగురు మంత్రులు సమీక్షకు వచ్చిన సందర్భంగా భారీగా నిరసన తెలిపారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 


రాయలసీమకు న్యాయం చేస్తామని, అది జగన్ హయాంలోనే సాధ్యమన్నారు మంత్రులు. సీమలో హైకోర్టు ఏర్పాటుపై ప్రభుత్వంలో చర్చ జరగుతోందని, 13 జిల్లాలూ అభివృద్ధి చెందాలన్నదే తమ సర్కారు లక్ష్యమని చెప్పారు. నవరతర్నాలు - పేదలందరికీ ఇళ్లు అనే అంశంపై కర్నూలులో మంత్రులు సమీక్ష జరిపారు. అన్నివర్గాలకు న్యాయం జరిగేలా అధికారులు పనిచేయాలని సూచించారు. కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన సమస్యల్ని కూడా పరిష్కరించాలని ఆదేశించారు. రాయలసీమ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్ ఉన్నారని చెప్పుకొచ్చారు మంత్రులు. రాజధానిపై బొత్స చేసిన వ్యాఖ్యల తర్వాత.. సీమలో ఉద్యమం ఊపందుకున్న పరిస్థితి కనిపిస్తోంది.


మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త ఉద్యమం ఊపిరి పోసుకుంది. కర్నూలులో ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. జిల్లా పర్యటనలకు వచ్చిన మంత్రులకు ఉద్యమ సెగ అంటుతోంది. చూడాలి ఈ నిరసనలు ఎంత వరకు దారితీస్తాయో.. !



మరింత సమాచారం తెలుసుకోండి: