ఏ ముఖ్యమంత్రికి దొరకని అరుదైన అవకాశం ఇది. ప్రపంచ ప్రసిధ్ధి చెందిన దేవదేవుడు తిరుమల తిరుపతి స్వామివారు. ఆయనకు ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు పెద్దగా రాష్ట్రాన్ని ఏలిన ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇది నిజంగా గొప్ప విషయం. దేశంలో ఏ ముఖ్యమంత్రికి దక్కని అరుదైన అవకాశమే. ఏపీకు ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎక్కువగా ఈ అవకాశం పొందారు. వైఎస్సార్ అయిదు సార్లు పట్టువస్త్రాలు సమర్పించి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు.


ఇపుడు జగన్ కి తొలి అవకాశం ఇది. జగన్ ఈ నెల 30న తిరుపతి చేరుకుని కొన్ని ప్రారంభోత్సవాలు జరిపిన తరువాత నేరుగా తిరుమల వెళ్ళి  బేడి ఆంజనేయస్వామి వద్ద నుంచి పట్టు వస్త్రాల ఊరేగింపులో పాల్గొంటారు. అనంతరం శ్రీవారి దర్శనం చేసుకుని  రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి వాహనం పెద్ద శేష వాహన సేవలో సీఎం పాల్గొంటారు.  ఇదిలా ఉండగా సీఎం తిరుపతి షెడ్యూల్  ఇలా ఉంది. ఈ నెల 30న  మధ్యాహ్నం 2.10 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి సీఎం వైఎస్‌ జగన్‌ చేరుకుంటారు. 3 గంటలకు తిరుచానూరు సమీపంలో పద్మావతి నిలయాన్ని సీఎం ప్రారంభిస్తారు.


అనంతరం 4.15 నిమిషాలకు అలిపిరి-చెర్లోపల్లి నాలుగు లైన్ల రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు.  సాయంత్రం 5.15 నిమిషాలకు నందకం అతిథి గృహం వద్ద వకుళా మాత అతిథి గృహాన్ని ప్రారంభిస్తారు. యాత్రికుల ఉచిత సముదాయ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. ఆ మీదట ఆయన‌ తిరుమల‌ వెళ్తారు. కాగా బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 30న ధ్వజారోహణంతో ప్రారంభమయి.. అక్టోబరు 8న చక్రస్నానంతో ముగుస్తాయి. మొత్తానికి అంగరంగ వైభవంగా ఈసారి చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: