జగన్ పాలనకు కొత్త. దానికి తోడు కొత్త రాష్ట్రం. ఇక మంత్రులు పేరుకు పాతిక మంది ఉన్నా నలుగురైదుగురు తప్పితే అంతా కొత్తవారే. ఇక అధికార గణాన్నే జగన్ నూటికి నూరు శాతం నమ్ముకున్నారు. వారే కన్నూ ముక్కూ చెవులుగా భావించి పాలన చేస్తున్నారు. మరి జగన్ ఆశించినట్లుగా పాలన సాగుతోందా. ఆశించిన ఫలితాలు వస్తున్నాయా...


అంటే సమాధానం లేదు అనే వస్తుంది. జగన్ విషయంలో అతి నమ్మకం అధికారుల మీద పెట్టి రాజకీయ నాయకత్వాన్ని పక్కకు  నెట్టి చేస్తున్న ఈ విన్యాసం వల్ల పాలన‌ పడుతూ లేస్తోంది తప్ప సజావుగా సాగడంలేదు. నాలుగు నెలలకే అసంత్రుప్తి రాజుకునేలా పాలన సాగడం అంటే విడ్డూరమే. జగన్ పై స్థాయిలో మంచి నిర్ణయాలు తీసుకుంటున్నా అవి క్షేత్ర స్థాయికి చేరడంలేదు. పైగా అధికారులు మోనిటరింగ్ అంటే దాని వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతోందని అంటున్నారు.


గ్రామ సచివాలయం పరీక్షలు నిర్వహించిన జగన్ కి ఎంత పేరు రావాలి. లక్షల్లో జాబ్స్ ఒకేసారి తీసిన ఘనతకు జనం జేజేలు పలకాలి. కాని చంద్రబాబు మీద విశ్వాసం కలిగిన అధికారులు ఇంకా చాలా మంది  ఉన్నారు. వారిలో కొంతమంది లీకేజ్ అనుమానాలు పుట్టించారు. అది కాస్తా అనుకూలమీడియాలో నెగిటివ్ రాతలు రాసేసి  చిరిగి చేట చేశారు. దాంతో రచ్చ రచ్చ అయింది. దాన్ని సరిగ్గా డిఫెండ్ చేసుకునే సామర్ధ్యం కూడా జగన్ సర్కార్ కి లేకుండా పోయింది. ఇపుడు కరెంట్ కోతలు కూడా వూరికే వచ్చాయా. ఓ వైపు వానలు బాగా పడుతున్నాయి. ఈ టైంలో కోతలేంటి. అంటే ప్రభుత్వానికి సరైన ఫీడ్ బ్యాక్ ఇచ్చేవారు లేదు.



పుట్టి మునిగిన తరువాతనే జగన్ వద్దకు సమాచారం వస్తుంది. ధర్మల్ విద్యుత్ కి బొగ్గు కొరత ఉందని వారం పాటు విధ్యుత్ కోతలు ఎడా పెడా అయ్యాక చెపుతున్నారు. దీంతో జనంలో ఆగ్రహం ఒక్కసారిగా  పెరిగిపోతోంది. తీరా ప్రభుత్వం దీనికి రిపేర్లు చేసుకునేలోగా జగన్ సర్కార్ జనంలో పరువు పోగొట్టుకుంటోంది. జనం విద్యుత్ కేంద్రాల వద్దకు చేరి ఆందోళనలు  చేస్తున్నారు. ఇదేమి  సర్కార్ తీరు.. భారీ వానల్లో కోతలేంటి అంటున్నారు. అలాగే ఇసుకు సరఫరా కూడా ఉంది. అదే విధంగా మిగిలిన పాలన కూడా సాగుతోంది. సకాలంలో చర్యలు తీసుకుని పరిస్థితిని ముందే గమనించి తీర్చిదిద్దుకునే  మెకానిజం జగన్ సర్కార్ కి లేదా. లేక అధికారుల రాజకీయం మూలంగా సర్కార్ పరువు భ్ర‌ష్టు పడుతోందా అన్నది చూడాలి. మొత్తానికి జగన్ కి షాకులు బాగానే తగులుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: