దాదాపుగా అడ్ర‌స్ గ‌ల్లంతు అయిపోయి...దిక్కులేని స్థితిలో చేరింద‌ని విమ‌ర్శ‌కుల‌చే కామెంట్ల‌ను స్వీక‌రిస్తున్న తెలంగాణ టీడీపీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ‌లో కీల‌కమైన హుజుర్‌నగర్ ఉపఎన్నికల్లో టీడీపీ పోటీకి సిద్ద‌మైంది. ఆదివారం తమ అభ్యర్థిని ప్రకటిస్తున్నట్టు టీడీపీ నేత‌లు చెప్పిన ప్ర‌కారం...బ‌రిలో నిలిచే నేత పేరును మీడియాకు వెల్ల‌డించారు. హుజూర్‌ నగర్‌ బై పోల్‌లో టీడీపీ తరపున చావా కిర్మణయి పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఆమె పేరును అధికారికంగా ప్రకటించింది టీడీపీ. సీనియర్ అయిన కిరణ్మయిని తమ అభ్యర్థిగా టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ప్రకటించి.. ఆమెకు బీఫామ్ అందచేశారు. 


పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డికి టీడీపీ మద్దతు ఇచ్చింది. అయితే, అనంత‌రం ఎంపీగా ఉత్త‌మ్ గెలుపొంద‌డంతో...ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ నేప‌థ్యంలో....అధికార తెరాస నుంచి శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ పద్మావతిరెడ్డి, బీజేపీ నుంచి కోటా రామారావు బరిలోకి దిగుతుండగా.. తాజాగా టీడీపీ కూడా పోటీ చేస్తున్నట్టు ప్రకటించడంతో ఉప పోరు రసవత్తరంగా మారనుంది.


గ‌త ఎన్నిక‌ల‌కు భిన్నంగా ఈసారి ఒంటరిగానే బరిలోకి దిగాలని టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో తెలంగాణ సీనియర్ నేతలు భేటీ అయిన తరువాత తాజా నిర్ణయం వెలువడింది. గ‌త కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నట్టు.. ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదని.. ఒంటరిగానే బరిలో దిగుతున్నట్టు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ స్పష్టం చేశారు. హుజూర్ నగర్ బై పోల్‌లో పోటీ చేయకపోతే పార్టీ మరింత కష్టాల్లోకి వెళ్లిపోతుందని ఎల్‌ రమణ అభిప్రాయపడ్డారు. పార్టీని నమ్ముకున్న కేడర్‌లో నమ్మకం కలిగించాలంటే పోటీ చేయడమే సరైందని అధిష్టానం భావించిందన్నారు. సీనియర్ నేతలు, కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని.. చివరకు కిరణ్మయిని తమ అభ్యర్థిగా ప్రకటించామని ఎల్‌ రమణ తెలిపారు. టీడీపీ ముఖ్యులు, సీనియర్లు సైతం తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పార్టీని వీడి, ఇతర పార్టీల్లో చేరారు. దాదాపుగా ఖాళీ అయిపోయిన టీడీపీని ఈ మ‌హిళా నేత ఏ విధంగా తిరిగి నిల‌బెడుతారో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: