హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో కొత్త హీట్‌ను సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో కొత్త దోస్తీ తెరమీద‌కు వ‌చ్చింది. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాల‌ని కోరుతూ...సీపీఐ రాష్ట్ర నేత‌ల‌తో గులాబీ ద‌ళ‌ప‌తి ముఖ్య‌నేత‌లు స‌మావేశం అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు టీఆర్‌ఎస్‌ పార్టీ సెక్రటరీ జనరల్‌ కే కేశవరావు, లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వర్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్‌కు వెళ్లారు. హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతునివ్వాలని ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్రనేతలను టీఆర్‌ఎస్‌ నాయకులు కోరారు. దీనికి సీపీఐ నేత‌లు సానుకూలంగా స్పందించ‌డం గ‌మ‌నార్హం.


సీపీఐ రాష్ట్ర నేతలతో సమావేశం అనంతరం టీఆర్‌ఎస్‌ పార్టీ సెక్రటరీ జనరల్‌ కే కేశవరావు మీడియాతో మాట్లాడుతూ...  టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు సీపీఐ నేతల్ని కలిశామని తెలిపారు. 'హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికలో సీపీఐ పోటీ చేయడం లేదని తెలిసి వారిని టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కోరాం. సీపీఐ నేతలు సుముఖంగా మాట్లాడారు. రాష్ట్రంలో సీపీఐ లేవనెత్తిన యురేనియం, పోడుభూముల సమస్యల పరిష్కారానికి టీఆర్‌ఎస్‌ మద్దతు తెలిపింది. యురేనియం తవ్వకాలను నిలిపి వేయాలని చెప్పారు. సీపీఐ నాయకులు చర్చించుకుని టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తారని ఆశిస్తున్నాం. వాళ్లు మాట్లాడిన విధానం చూస్తే పొత్తుకు సై అన్నట్లే ఉంది. కమ్యూనిస్టు పార్టీలు తోక పార్టీలు అనుకోవడం తప్పు. ఉప ఎన్నికలో మద్దతు సహా చాలా అంశాలపై సీపీఐతో చర్చించామని' కేకే పేర్కొన్నారు.


ఇదిలాఉండ‌గా, హుజూర్‌నగర్ బ‌రిలో దిగ‌నున్న‌ట్లు టీడీపీ ప్ర‌క‌టించింది. ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ తరపున చావా కిర్మణయి పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఆమె పేరును అధికారికంగా టీడీపీ ప్రకటించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో చర్చించాక కిర్మణయి పోటీపై నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ అయిన కిరణ్మయిని తమ అభ్యర్థిగా టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ప్రకటించి.. ఆమెకు బీఫామ్ అందచేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: