కాశ్మీర్ ఎవరిది అంటే మాది అంటుంది పాకిస్థాన్. కానీ చరిత్ర చూస్తే ఎపుడూ కాశ్మీర్లో  మతపరమైన ఆధిపత్యం పోకడలు లేవు. అన్ని మతాల సామరస్యంతో కాశ్మీర్ గడ్డ ఆదర్శంగా నిలిచింది. అటువంటి కాశ్మీర్ సంస్థానానికి ఒక అగ్నిపరీక్ష ఎదురైంది. అదేంటి అంటే భారత దేశానికి స్వాతంత్రం వచ్చాక అటు పాకిస్థాన్, ఇటు భారత్ విడిపోయిన వేళ తాను ఎక్కడ ఉండాలి అని. దాంతో కాశ్మీర్ ఏ నిర్ణయం తీసుకోకుండానే పాక్ ఆక్రమించాలని చూసింది. ఈ పరిణామాలు, భారత్ మీద ఉన్న నమ్మకం అన్నీ కలసి కాశ్మీర్ భారత్ లో చేరేందుకు రెడీ అయింది. తరువాత 370 ఆర్టికల్ రక్షణ ఇవన్నీ కొంత రాజ‌కీయంగానూ వచ్చాయన్నది తెలిసిందే.


ఇప్పటికి రెండు నెలలు అయింది 370 ఆర్టికల్ తొలగించి. ఆ తరువాత కాశ్మీర్ భారత్ లో పూర్తిగా అంతర్భాగం అయింది. ఇక కాశ్మీర్లో శాంతిభద్రతలు లేవని, అక్కడ అణచివేత సాగుతోందని, ముస్లిం యువతను వేధిస్తున్నారని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మొన్ననే ఐక్య రాజ్యసమితిలో ప్రసంగం చేసి వచ్చాడు. ఆయన మాటలకు ఏ మాత్రం విలువ లేదన్నది అందరికీ తెలిసిందే. మరి లోకానికి కాశ్మీర్ ఎలా  ఉందో తెలియచేసే సందర్భం ఒకటి వస్తోంది. అదే విభజన కాశ్మీర్లో ఎన్నికలు.


అక్టోబర్ 24న కాశ్మీర్లో ఎన్నికలు జరిపించేందుకు ఎన్నికల సంఘం సిద్ధపడుతోంది.ఆర్టికల్ 370 రద్దు తరువాత జరిగే ఈ ఎన్నికలు కాశ్మీర్ అసలు ఏంటి, అక్కడ జనం ఏమనుకుంటున్నారు అన్నది కళ్లకు కట్టినట్లుగా చూపించబోతోంది. కాశ్మీర్లో బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ (బీడీసీ) ఎన్నికలను అక్టోబర్ 24న జరిపించనున్నట్లుగా చీఫ్ ఎలక్ట్రోరల్  అధికారి శైలేంద్ర కుమార్ తెలిపారు. మొత్తం 310 బ్లాకులకు ఈ ఎన్నికలు జరుగుతాయి.


దీనికి సంబంధించి అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, నామినేషన్లకు గడువు అక్టోబర్ 9న ముగుస్తుందని, అక్టోబర్ 11తో చివరి తేదీ అని ఆయన చెప్పారు. దీంతో ఇపుడు కాశ్మీర్లో ఎన్నికల సందడి మొదలైంది. మరి కాశ్మీర్లో ప్రజాస్వామ్యం లేదు, అక్కడ జనాభిప్రాయం లేదు అని అన్న వారికి ఈ ఎన్నికలు ఒక గుణపాఠం కాబోతాయని అంటున్నారు. కాశ్మీర్ ప్రజలు నిజానికి తాము ఏమి కోరుకుంటున్నారన్నది ఈ ఎన్నికల ద్వారానే తెలుస్తుందని కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికలు  సజావుగా సాగి ప్రజాభిప్రాయం గట్టిగా వ్యక్తమైతే అసెంబ్లీ ఎన్నికలకు కూడా మోడీ సర్కార్ రంగం సిధ్దం చేస్తుందని కూడా అంటున్నారు. మొత్తానికి కాశ్మీర్ భారత జన జీవనంలో అంతర్భాగం అయిన తరువాత జరగనున్న ఈ ఎన్నికలు ఆసక్తిని  కలిగిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: