ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయి. పట్టణాలతో పోలిస్తే గ్రామాలలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కొన్ని గ్రామాలలో ఐదు గంటల పాటు విద్యుత్ కోతలు ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. వర్షాకాలం కావటంతో దోమల బెడద కూడా ఎక్కువగానే ఉంది. ఇలాంటి సమయంలో విద్యుత్ కోతలతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. 
 
రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని గ్రామాల్లో సాయంత్రం 6 గంటల సమయంలో విద్యుత్ కోతలు ఏర్పడుతూ ఉండటంతో ప్రజలు చీకట్లో ఇబ్బందులు పడుతున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, వైజాగ్ జిల్లాల్లోని గ్రామాలలో కూడా ఇదే పరిస్థితి ఉందని సమాచారం. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సాధారణంగా రోజుకు 75 వేల మెట్రిక్ టన్నుల వరకు బొగ్గు అవసరం అవుతుంది. 
 
కానీ రోజుకు 40 వేల మెట్రిక్ టన్నులకు మించి సరఫరా కావటం లేదని సమాచారం అందుతుంది. ఏపీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బొగ్గు సరఫరా కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోని తప్పుడు విధానాలు, అవినీతి  ప్రస్తుతం విద్యుత్ రంగంలోని క్లిష్ట పరిస్థితులకు కారణం అని అన్నారు. 
 
కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం జగన్ బొగ్గు కొరత సమస్య పరిష్కారం కొరకు లేఖ రాశారని మంత్రి బాలినేని తెలిపారు. తెలంగాణ సీఎంను సింగరేణి నుండి బొగ్గు సరఫరా పెంచాలని సీఎం జగన్ కోరినట్లు తెలిపారు. రెండు రోజుల్లో రోజుకు 57 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అందుతుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బొగ్గు కొరత మరియు సాంకేతిక కారణాల వలన 6 థర్మల్ విద్యుత్ కేంద్రాలు తాత్కాలికంగా మూత పడ్డాయని సమాచారం అందుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: