దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై ద‌శాదిశ‌ను నిర్దేశించే....మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఓ వైపు దోస్తీ అంటూనే మ‌రోవైపు మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న పార్టీలు క‌త్తులు దూస్తున్నాయి. బీజేపీ-శివసేన మధ్య సీట్ల పంపకానికి సంబంధించి చర్చలు జరుగుతుండగా, మరోవైపు శివసేన తమ పార్టీ అభ్యర్థులకు ఆదివారం నాడు 'ఏబీ' ఫాంలను పంపిణీ చేసింది. త‌న మిత్రపక్షం బీజేపీతో ఇబ్బందుల్లేని స్థానాల్లో సుమారు 20 మంది అభ్యర్థులకు బీ ఫారాలను అందజేసినట్లు శివ‌సేన‌ తెలిపింది.


శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాక్రే, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సీట్ల పంపకాలకు సంబంధించిన ప్రకటనను  జరిగే సంయుక్త సమావేశంలో  ప్రకటించే అవకాశాలున్నాయంటూ వార్తలు వినిపించిన నేపథ్యంలో...2014 ఎన్నికల్లో పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులకు ఆయా స్థానాల్లో తిరిగి పోటీకి వీలుగా శివసేన ఈ ఏబీ ఫాంలు అందించింది.శివసేన ఈ విధంగా వ్యవహరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహారాష్ట్రలో శివసేనతో సీట్ల సర్దుబాటుపై నిర్ణయం రెండు రోజుల్లో వెల్లడిస్తామని బీజేపీ వర్గాలు తెలిపాయి.


మ‌రోవైపు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే పోటీ చేయనున్నారు. వర్లీ స్థానం నుంచి ఆయన అభ్యర్థిత్వాన్ని శివసేన ఖరారు చేసింది. శివసేనను స్థాపించిన బాల్‌ఠాక్రే కుటుంబం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి వ్యక్తి ఆదిత్య కావడం విశేషం. ఆదివారం ఆదిత్యకు ఆయన తండ్రి, శివసేన అధినేత ఉద్ధవ్‌.. బీ ఫామ్‌ అందజేశారు. కాగా, అభ్యర్థుల ఎంపికకు బీజేపీ కేంద్ర కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగింది. ఏడు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు.  
కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 51 స్థానాలకు అభ్యర్థులతో కాంగ్రెస్‌ పార్టీ తొలి జాబితాను ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది. ఒక లోక్‌సభ స్థానంతోపాటు రాజస్థాన్‌, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలకూ సోనియా అభ్యర్థులనూ ఖరారు చేశారు. మ‌హారాష్ట్రలోని భోకార్‌ నుంచి మాజీ సీఎం అశోక్‌ చవాన్‌ బరిలో నిలుస్తారు. సంగమ్నర్‌ స్థానం నుంచి పీసీసీ అధ్యక్షుడు విజయ్‌ బీఎస్‌ థోరాట్‌, లాతూర్‌ నుంచి మాజీ సీఎం విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ కొడుకు అమిత్‌, షోలాపూర్‌ సిటీ సెంట్రల్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే కూతురు ప్రణితి, నాగ్‌పూర్‌ నార్త్‌ (రిజర్వుడ్‌) స్థానం నుంచి ఎంపీసీసీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు నితిన్‌రౌత్‌ పోటీ చేస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: