హిందువుల పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల.. నిత్యం భక్తుల గోవింద నామస్మరణతో మారు మోగుతుంది. గోవింద.. వేంకటరమణ.. సంకటహర అనే భక్తుల పలువరింతలు ఆ మహా క్షేత్రంలో వినిపిస్తూనే ఉంటాయి. స్వామిని దర్శనం చేసుకోవాలన్నా.. నిలువెత్తు స్వామి అలంకారం కళ్లారా చూడాలన్నా.. కేవలం అరక్షణమే. ఆ క్షణకాల దర్శన భాగ్యంతో భక్తుల కళ్లల్లో ఆనందభాష్పాలు.. ఒంట్లోకి శక్తి.. మనసు పులకరించే ఆనందం భక్తుల సొంతమైపోతుంది. రోజులు, గంటలు వేచి చూసిన అలసట భక్తుల్లో మాయమైపోతుంది. అదే బ్రహ్మోత్సవాల సమయంలో అయితే భక్తుల ఆనందం రెట్టింపవుతుంది. ప్రస్తుతం సప్తగిరులు శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలతో పులకించిపోతున్నాయి.



 ఏటా స్వామికి జరిగే బ్రహ్మోత్సవాల కోసం భక్తులు ఎదురుచూస్తూంటారు. రాష్ట్రం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వీక్షణం కోసం, స్వామి దర్శనం కోసం లక్షల సంఖ్యలో భక్తులు కొండకు తరలి వస్తూంటారు. ఎన్నిరోజులైనా స్వామి దర్శనం కోసం వేచి చూస్తారు. ఆపదమొక్కుల వాడా.. గోవిందా.. గోవింద అంటూ మొక్కులు చెల్లించుకుని కష్టాలు తొలగించుకోవాలి అనుకునేవారు కొందరైతే, స్వామి దివ్య దర్శనంతో జన్మ ధన్యం చేసుకోవాలని అనుకునేవారు మరికొందరు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులూ.. మెరిసిపోయే రూపాల్లో స్వామి తిరువీధుల్లో ఊరేగుతూంటాడు. నిత్యం భక్తులను తన దగ్గరకు రప్పించుకునే స్వామి.. ఈసారి మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేస్తాడు. బ్రహ్మోత్సవవాల్లో బ్రహ్మాండనాయకునికి జరిగే వైభోగం భూమండలమంతా మోగిపోతుంది. బ్రహ్మోత్సవాల వైభోగం చూడాలంటే స్వామి కరుణ, అనుగ్రహం ఉండాల్సిందే. చూసేందుకు రెండు కళ్లూ సరిపోని ఆ వైభోగం జన్మ జన్మల అదృష్టం. 

 


బ్రహ్మోత్సవాల్లో.. తొలిరోజు ధ్వజారోహణం. రెండో రోజు చిన్న శేషవాహనంపై స్వామి ఊరేగింపు, మూడో రోజు సింహ వాహన సేవ, నాలుగో రోజు కల్పవృక్ష వాహనంలో దర్శనం, అయిదో రోజు గరుడ వాహనంపై మోహినీ అవతారంలో, అత్యంత విలువైన ఆభరణాల్లో ధగధగ మెరిసిపోయే స్వామి ఊరేగింపు, ఆరో రోజు హనుమంత వాహనంపై ఊరేగింపు, ఏడో రోజు మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంలో ఊరేగింపు, ఎనిమిదో రోజు ఉభయ దేవేరులతో కలిసి స్వామి మహారథంపై విహారం, తొమ్మిదో రోజు బ్రహ్మోత్సవాల అంతిమ ఘట్టం. ఆరోజు శ్రీవారి పుష్కరిణి గట్టుపై శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామికి తిరుమంజన సేవ జరిపి స్వామి సుదర్శన చక్రాన్ని పుష్కరిణిలో స్నానం చేయిస్తారు.



తర్వాత రోజు సాయంత్రం శ్రీవారి ఆలయ ధ్వజస్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణం చేస్తారు. ఈ అవరోహణంతో బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకూ వీడ్కోలు పలికినట్లవుతుంది. బ్రహ్మోత్సవాలు కూడా మంగళపూర్వకంగా పూర్తైనట్టే. బ్రహ్మోత్సవాల అనంతరం మరో ముఖ్యమైన ఉత్సవం తిరుగు పయనం. మాఢవీధుల్లో అపసవ్య దిశలో స్వామివారిని ఊరేగిస్తారు. దీంతో తొమ్మిది రోజుల పాటు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా పూర్తవుతాయి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: