హుజూర్‌ నగర్ బై ఎలక్షన్స్‌లో సీపీఐకి ఎందుకింత గిరాకీ..?  సీపీఐ వెంట టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఎందుకు వెంట పడుతున్నాయి...? అప్పుడెప్పుడో హుజూర్‌ నగర్‌లో పోటీ చేసిన సీపీఐకి ఎందుకింత డిమాండ్‌..? అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేతలను రాయబారం పంపే సీన్‌ సీపీఐలో ఏముంది..?


హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు ? అనే అంశం కంటే సీపీఐ చుట్టూ పార్టీలు తిరగడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రెండు రోజులుగా ఆ పార్టీ కార్యాలయం ముఖ్దూం భవన్ సందడిగా మారింది. ఆ పార్టీ మద్దతు కోరుతూ టీఆర్ఎస్ నేతలు  కార్యాలయానికి  వెళ్లారు. గులాబీ పార్టీ సీనియర్ నేతలు కేకే, వినోద్, నామా నాగేశ్వర్ రావులు ... చాడ వెంకట్ రెడ్డితో చర్చలు జరిపారు.


తెల్లారేసరికి కాంగ్రెస్ నేతలు సైతం  ఆ పార్టీ కార్యాలయంలో వాలిపోయారు. తమకే మద్దతు ఇవ్వాలంటూ ...పాత స్నేహంను గుర్తు చేశారు కాంగ్రెస్‌ నేతలు. గతంలో కలిసి పోటీ చేసిన అంశాలను ప్రస్తావించారు. ఈ రెండు పార్టీలు బహిరంగంగా కలిస్తే ...ఇప్పుడు ఆ లిస్ట్‌లో సీపీఎం కూడా చేరింది. ఇంటి పార్టీ అయిన సీపీఐని సాయం కోరింది. అసలు ఈ మధ్య కాలంలో సీపీఐ హుజూర్ నగర్ లో పోటీ చేయలేదు. పోటి చేయాలన్న ఆలోచన కూడా సీపీఐ పార్టీ చేయలేదు.


టీఆర్ఎస్ ఏం లెక్కలు వేసుకుందో ఏమో ...హఠాత్తుగా సీపీఐ మద్దతు కోరింది. వాస్తవానికి అక్కడ ఆ పార్టీ  బలం పరిమితమే. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎం.పి.టి.సి, జెడ్.పి.టి.సి పదవులకు పోటి చేసిన సీపీఐ అభ్యర్ధులకు 12 నుంచి 13 వేల ఓట్లు పోల్ అయ్యాయి. 2018 ఎన్నికల్లో ఇక్కడ గెలిచిన ఉత్తమ్ ...7 వేలకు పై చిలుకు ఓట్లతో గెలిచారు. అప్పుడు సీపీఐ ఉత్తమ్‌కు  మద్దతు ఇచ్చింది.  ఆ ఎన్నికల్లోనే  ట్రక్కు గుర్తుకు 4 వేల వరకు ఓట్లు పడ్డాయి. టీఆర్‌ఎస్‌  లెక్కల ప్రకారం ట్రక్కుకు పడ్డ ఆ నాలుగు వేల ఓట్లు తమవే అంటున్నారు. ఆ విధంగా చూస్తే ఉత్తమ్ గెలిచింది మూడు వేల ఓట్లతోనే అన్న వాదన టీఆర్‌ఎస్‌ది. అందుకనే వ్యూహత్మకంగా సీపీఐ సాయం కోరింది గులాబీ పార్టీ. తక్కువలో తక్కువ సీపీఐ నుంచి 5 వేల ఓట్లు రాబట్టుకోగలిగితే ఈజీగా గెలుస్తామన్నది అధికార పార్టీ ధీమా.


2018 ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్‌తోనే కలిసి పోటీ చేసింది. ఈ సారి ఆ పార్టీ విడిగా పోటి చేయడం కాంగ్రెస్‌కు నష్టం.. తమకు లాభమనే ఆలోచనల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఉంది. ఏ చిన్న అవకాశాన్ని టీఆర్‌ఎస్‌ వదులుకోకూడదన్న ఆలోచనలో ఉంది. దీంతో సీపీఐతో చెలిమికి టీఆర్‌ఎస్‌ మొగ్గుచూపింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో గులాబీ పార్టీ సీటు కోల్పోవలసి వచ్చింది. ఆ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండడం కోసమే సీపీఐ మద్దతు కోరింది  టీఆర్‌ఎస్‌.



మరింత సమాచారం తెలుసుకోండి: