హుజూర్‌ నగర్‌లో నామినేషన్ల దాఖలు  ఘట్టం ముగిసింది. అన్ని పార్టీల కీలక నాయకులు ప్రచారం స్పీడ్‌ పెంచారు. రాజకీయ విమర్శలకు పదును పెడుతున్నారు నాయకులు. ఒకరిది సెంటిమెంట్‌.. మరొకరిది గెలవాల్సిన పరిస్థితి... మిగతావాళ్లది పట్టు సాధించాలనే తాపత్రయం... ఇదీ హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక రాజకీయ ముఖచిత్రం.  నామినేషన్ల దాఖలు  ఘట్టం ముగియడంతో.. ఈ కోణంలోనే  గెలుపు వ్యూహాలు రచిస్తున్నాయి పార్టీలు. బై ఎలక్షన్‌ ఏదైనా సత్తా చాటుతూ వస్తున్న అధికార టీఆర్‌ఎస్‌..  హుజూర్‌నగర్‌లోనూ దానిని రిపీట్‌ చేయాలని చూస్తోంది. అందులో భాగంగానే  సీపీఐతో వ్యూహాత్మక  పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు మంత్రి  జగదీష్‌రెడ్డి.  ఉప ఎన్నికలో పార్టీ ఇంచార్జ్‌ తానేని ఆయన చెప్పారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కు చెప్పుకోవడానికి అజెండా లేకపోవడం వల్లే టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.  


ఎవరెలాంటి  ప్రచారం, విమర్శలు చేసినా..గెలుపు మాత్రం కాంగ్రెస్‌దే అంటున్నారు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి. ఇక్కడ నుంచి తన భార్య పద్మావతిని కాంగ్రెస్‌ అభ్యర్ధిగా బరిలో దించిన ఆయన.. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
హుజూర్‌నగర్‌లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు కమలనాథులు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండటం వల్లే భారీగా నామినేషన్లు దాఖలయ్యాయనీ... పార్టీ తెలంగాణ చీఫ్‌ లక్ష్మణ్‌ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ బీ పార్టీగా తయారైందని విమర్శించారు.  గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జతకలిసిన టీడీపీ.. ఈ ఉప ఎన్నికలో ఒంటరిగానే పోటీ చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందంటున్నారు టీటీడీపీ చీఫ్‌ ఎల్‌. రమణ. ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్రులు కూడా భారీగానే బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. 119 మంది నామినేషన్‌ పత్రాలను అందజేసినా.. నామినేషన్ ల ఉపసంహరణ తర్వాత ఎంత మంది బరిలో ఉంటారో క్లారిటీ వస్తుంది. 


మొత్తానికి హుజూర్ నగర్ లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మైకులకు పనిచెప్పనున్న నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ అయ్యారు. మరోవైపు సీపీఐ ప్రధాన పార్టీలకు ఒక ఆశాజ్యోతిగా నిలుస్తోంది. 








మరింత సమాచారం తెలుసుకోండి: