ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ టార్గెట్‌గా పావులు క‌దుపుతున్న పాకిస్థాన్‌..ఈ క్ర‌మంలో ప్ర‌తి అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటోంది. ఇందుకోసం రాజ‌కీయాలు, ద్వైపాక్షిక సంబంధాల‌ను వాడుకున్న ఆ దేశం తాజాగా భ‌క్తిని సైతం వినియోగించుకుంటోంది. సిక్కుల ఆధ్యాత్మిక కేంద్ర‌మైన క‌ర్తార్‌పూర్ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌ దర్బార్‌ సాహిబ్‌తో పంజాబ్‌లోని గుర్‌దాస్‌పూర్‌ జిల్లాలో గల డేరా బాబా నాయక్‌ పుణ్య క్షేత్రాన్ని అనుసంధానించేందుకు క‌ర్తార్‌పూర్‌ కారిడార్‌ను నిర్మించారు. అయితే, కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవానికి మోదీని కాకుండా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ఆహ్వానించాలని నిర్ణయించింది.


ఒక టీవీ చానెల్‌తో పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషి  మాట్లాడుతూ..‘భారీ స్థాయిలో కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రారంభించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ వేడుకలకు భారత్‌ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఆహ్వానించాలని నిర్ణయించాం. త్వరలో ఆయనకు లాంఛనంగా ఆహ్వానం పంపుతాం’ అని చెప్పారు. సిక్కు సామాజిక వర్గానికి మన్మోహన్‌ సింగ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. జమ్ముకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేసినందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ పట్ల కినుక వహించిన పాకిస్థాన్ ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. అయితే పాకిస్థాన్‌ ఆహ్వానంపై తమకు ఎటువంటి సమాచారం లేదని మన్మోహన్‌ సింగ్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి ఆయన హాజరు కాబోరని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 


కాగా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ కారిడార్‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ..  భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక బంధంలో కర్తార్‌పూర్ కారిడార్(మార్గం) నూతన అధ్యాయమని, ఇరుదేశాల ప్రజల మధ్య ఇది వారధిగా నిలుస్తుందని చెప్పారు. ఈ మార్గం ఇరుదేశాల మధ్య కొత్త ద్వారాలను తెరుస్తుంది. కొత్త అవకాశాలకు చేరువచేస్తుంది. రెండు దేశాల ప్రజల మధ్య ఉమ్మడి ఆధ్యాత్మిక వారసత్వానికి, ప్రేమకు కర్దార్‌పూర్ కారిడార్ వారధిగా నిలువాలి అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తంచేశారు. 


కాగా, పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న 16వ శతాబ్దం నాటి దర్బార్ సాహిబ్ గురుద్వారాను భారతీయ సిక్కుయాత్రికులు దర్శించుకునేందుకు వీలుగా ఇరుదేశాల మధ్య కారిడార్‌ నిర్మించారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఉన్న డేరాబాబా నానక్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు వరకు కారిడార్ నిర్మాణాన్ని భారత్ చేపట్టనుండగా, తన భూభాగంలో ఆ ప్రాజెక్టును పాక్ పూర్తిచేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: