వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన నిత్యం పనుల బిజీలో ఉంటారు. అటు అధికారిక కార్యక్రమాలు, ఇటు సమీక్షలు, మరో వైపు పర్యటనలు, ఇంకోవైపు పార్టీ కార్యక్రమాలు ఇలా జగన్ రోజు మొత్తానికి సరిపోయే బిజీ షెడ్యూల్లో ఉంటారు. పైగా ఆయన రాష్ట్రానికి అతి ముఖ్యమైన నాయకుడు. ముఖ్యమంత్రి సీటు అంటేనే గౌరవనీయమైనది. అందులో కూర్చున్న జగన్ ఇపుడు అలా చేయగలరా.


ఈ సందేహమే ఇపుడు వైసీపీ నేతల్లో వెంటాడుతోంది. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు, పాదయాత్ర చేస్తున్నపుడు కూడా సీబీఐ కోర్టుకు హాజరయ్యేవారు. ప్రతి శుక్రవారం ఠంచనుగా ఆయన కోర్టు బోనులో నిలబడేవారు. దాంతో జగన్ పాదయాత్ర కోసం తనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కోరినా ప్రయోజనం లేకపోయింది. వారం రోజులు తిరిగిన తరువాత  ఒక రోజు రెస్ట్ గా ఉంటుంది. కోర్టుకు రావాల్సిందేనని నాడు సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది. దాంతో బ్రేకింగ్ పాదయాత్ర అని జగన్ని టీడీపీ విమర్శలు కూడా చేసింది. ఇవన్నీ ఎలా ఉన్నా జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.


ఇపుడు సీఎం హోదాలో జగన్ ప్రతి శుక్రవారం కోర్టు బోనులో నిలుచుంటే ఏ మాత్రం బాగోదు. పైగా జగన్ ఇమేజ్ కి కూడా గండిపడుతుంది. వూసుపోక ఖాళీగా ఉన్న టీడీపీకి కూడా కొత్త అస్త్రాలు అందించినట్లు అవుతుంది. దీంతో జగన్ తనకు సీఎం గా బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి వ్యక్తికగ హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని  సీబీఐ కోర్టుకు పిటిషన్ పెట్టుకున్నారు. అయితే దీని మీద నాంపల్లి సీబీఐ కోర్టులో జరిగిన విచారణలో జగన్ పిటిషన్ మీద సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 


జగన్ కోర్టుకు హాజరుకావాల్సిందేనని వాదించింది. లేకపోతే ఆయన సాక్ష్యులను  ప్రభావితం చేస్తారని కూడా పేర్కొంది. ఇదే పిటిషన్ గతంలో విచారణకు వచ్చినపుడు హైకోర్టు కొట్టేసిందని కూడా గుర్తు చేసింది. మరి దీని మీద తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేస్తూ సీబీఐ  కోర్టు నిర్ణయం తీసుకుంది 18న తేదీన కోర్టు ఏ విధమైన నిర్ణయం వెలువరిస్తుందో అన్న ఉత్కంఠ వైసీపీలో ఉంది. జగన్ని కోర్టుకు రమ్మంటే మాత్రం ఏపీ రాజకీయాలో అది సంచలనమే అవుతుంది. కోర్టుకు ప్రతీ శుక్రవారం వెళ్లే సీఎం గా కూడా జగన్ రికార్డు స్రుష్టిస్తారేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: