తెలంగాణ ఆర్టీసీ జేఏసీతో ఐఏఎస్ అధికారుల కమిటీ చర్చలు జరిపింది. కానీ ఈ చర్చలు విఫలం కావటంతో రేపటినుండి ఆర్టీసీ సమ్మె యథాతథంగా జరగనుంది. ఆర్టీసీ జేఏసీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని పట్టుబట్టింది. అధికారుల నుండి జేఏసీ ఆశించిన విధంగా స్పందన లేకపోవటంతో ఆర్టీసీ జేఏసీ సమ్మెకు సై అంది. ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునివ్వటంతో ప్రభుత్వం తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్ల నియామకం చేపడుతోంది. 
 
ప్రయాణికులకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఆర్టీసీ ఉన్నతాధికారులు డ్రైవర్లు మరియు కండక్టర్ల నియామకం చేపడుతున్నారు. 18 నెలల కాలపరిమితి పూర్తి కావటంతో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్, 25 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ డ్రైవర్ పోస్టులకు అర్హులని సమాచారం. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు కండక్టర్ల ఉద్యోగాలకు అర్హులని తెలుస్తోంది. 
 
తాత్కాలిక ఉద్యోగాలకు ఎంపికైనవారు సమ్మె కాలంలో డిపో మేనేజర్ దగ్గర 10వ తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్ భద్రపరచవలసి ఉంటుంది. రిటైర్డ్ అయిన మెకానిక్, సూపర్ వైజర్, క్లరికల్ స్టాఫ్ పనిచేయడానికి ఆసక్తి ఉంటే రీజనల్ మేనేజర్ కార్యాలయంలో ఈరోజు సంప్రదించవచ్చని తెలుస్తోంది. రిటైర్డ్ అధికారులు మరియు సూపర్ వైజర్ లకు 1,500 రూపాయలు, క్లరికల్ మరియు రిటైర్డ్ మెకానిక్ ఉద్యోగులకు 1,000 రూపాయల వేతనం ఉంటుంది. 
 
తాత్కాలికంగా పని చేసే డ్రైవర్లకు 1,500 రూపాయలు, కండక్టర్లకు 1,000 రూపాయల వేతనం ఉంటుందని సమాచారం. ప్రైవేట్ స్కూల్ డ్రైవర్లతో బస్సులు నడపాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సమాచారం. ఆర్టీసీ కార్మికులు అధికారుల ముందు 26 డిమాండ్లను పెట్టారని తెలుస్తోంది. అధికారులు ఆర్టీసీ కార్మికులను సమ్మెపై పునరాలోచన చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రయాణికులు కొంతమేర ఇబ్బందులు పడే అవకాశం ఐతే ఉంది. 


 



మరింత సమాచారం తెలుసుకోండి: