గత ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి జనసేనలో చేరిన ఆకుల సత్యనారాయణ ఇప్పుడు మళ్లీ పార్టీ మారబోతున్నారని తెలుస్తోంది. దీనిపై ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా ఇప్పుడు క్లారిటీ వచ్చిందని సమాచారం. రాజమండ్రి సిటీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉండగానే జనసేనలో చేరారు ఆకుల సత్యనారాయణ. జనసేనలో మరిన్ని చేరికలు ఉంటాయని అవి బీజేపీ నుంచి కూడా ఉంటాయని ఆ సందర్భంలో అన్నారు. పార్టీ కార్యకర్తలతో భారీ హంగామాతో ఆయన జనసేనలో చేరారు. 


మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేశారు ఆకుల సత్యనారాయణ. ఆ ఎన్నికల్లో ఆయనకు లక్షా 55వేల ఓట్లు పోలయ్యాయి. ఎంపీగా వైసీపీ అభ్యర్ది గెలిచిన ఆ ఎన్నికల్లో ఆకుల మూడో స్థానంలో నిలిచారు. జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానుల ఓట్లే ఆయనకు ఎక్కువగా వచ్చాయిని అప్పట్లో ప్రచారం జరిగింది. బీజేపీలో ఎమ్మెల్యేగా ఉండి జనసేనలో చేరడం కొందరికి నచ్చలేదని అందుకే ఓటమి చెందారని అన్నారు. ఎన్నికల్లో జనసేన ఓటమి తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం అరుదుగా జరిగింది. విజయవాడలో జరిగిన పార్టీ సమావేశాలకు హాజరుకాలేదు. దీంతో జనసేనను ఆకుల వీడుతున్నారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు జనసేనను వీడుతూ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరతున్నారని వార్తలు వస్తున్నాయి. 


నిజానికి ఆకుల చెప్పినట్టు బీజేపీ నుంచి ఎవరూ జనసేనలో చేరలేదు. వేరే పార్టీ నుంచి జనసేనలో చేరిన వాళ్లలో ఆకుల సత్యనారాయణే కాస్తంత పేరున్న నాయకుడు. ఫలితాల్లో ఓటమి తర్వాత తన భవిష్యత్తుకు జనసేన ఉపయోగం లేదనే ఆయన వైసీపీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బీజేపీలో ఇమడలేనని జనసేనలో చేరిక సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. సొంత గూటికి వెళ్లే అవకాశం లేకపోవడంతో వైసీపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: