ఆర్టీసీ స‌మ్మె ఖాయ‌మైంది. హైదరాబాద్ ఎర్రమంజిల్ లో ఈ ఉదయం ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులతోి ఐఏఎస్ కమిటీ జరిపిన చర్చలు ముగిశాయి. అయితే, ఈ సమావేశం సంతృప్తిగా జరగలేదని… చర్చలు ఫెయిలయ్యాయని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి చెప్పారు. మ‌రోవైపు, ఆర్టీసీ యూనియన్ల సమ్మె నిర్ణయంపై సర్కారు సీరియస్‌‌గా ఉంది. స్ట్రైక్‌‌కు వెళ్తే కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిసింది. ఇందుకోసం త‌మిళ‌నాడు లాగే వ్య‌వ‌హ‌రించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ‘ఆర్టీసీలోని వాళ్లందరూ పబ్లిక్‌‌ సర్వెంట్లే. చట్టంలోని ఓ సెక్షన్‌‌ ఇదే విషయం చెబుతోంది. సమ్మెకు పోతే ఉద్యోగాలు పోవడం ఖాయం. ఆ పవర్స్‌‌ ప్రభుత్వానికి ఉన్నాయి. గతంలో తమిళనాడులో జయలలిత సీఎంగా ఉన్నప్పుడు సమ్మెకు పోతే ఇలాగే జరిగింది’ అని పేర్కొంటున్నారు.


ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ...“గత రెండురోజులుగా చెప్పిందే ఇవాళ కూడా ఐఏఎస్ అధికారులు చెప్పారు. రాతపూర్వకంగా హామీ ఇవ్వాలన్నాము. స్పష్టమైన హామీ ఇవ్వకుంటే రేపటి నుండి సమ్మెకు పోతాం. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. ప్రజలు కూడా మా సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. మేధావులు, విద్యార్థి సంఘాలు మా పోరాటంలో భాగస్వాములు కావాలి. ఎస్మా చట్టాలు, పీడీ యాక్టులు ఆర్టీసీ కార్మికులకు కొత్త కాదు. రేపటి సమ్మె యధాతధంగా కొనసాగుతుంది. సీఎం ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులు తెలుసుకుని సమస్యలను పరిష్కరించాలి. 50 వేల మంది కార్మికులం సమ్మెలో పాల్గొంటాం. ఇప్పటికే దూర ప్రాంతాల సర్వీసులు ఆగిపోయాయి. ఉద్యోగ సంఘాలు మా సమ్మెకు మద్దతు తెలపాలి”అని అన్నారు.


కాగా, సమ్మె అనివార్యం కావ‌డంతో రవాణాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ట్రాన్స్‌పోర్ట్ భవన్‌లో ఆర్టీసీ ఎండీ, ఇతర అధికారులు, రవాణాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు రవాణాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. తాత్కాలికంగా రెండువేల మంది డ్రైవర్లను అందుబాటులో పెట్టుకుంటున్నారు. వీటితోపాటు తాత్కాలిక డ్రైవర్లకు భత్యం, రవాణా వాహనాలకు తాత్కాలిక పర్మిట్లు.. ఇలా ప్రతి అంశంపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే ఎలాంటి అడ్డంకులు లేకుండా దసరా సీజన్ లో వాహనాలను విస్తృతంగా నడపాలని రవాణాశాఖ భావిస్తున్నది. దీనికోసం తాత్కాలికంగా రెండువేలమంది నిపుణులైన డ్రైవర్లు, తగిన సంఖ్యలో కండక్టర్లను నియమించనున్నారు. డ్రైవింగ్‌లో కనీసం ఏడాదిన్నర అనుభవంతోపాటు హెవీవెహికిల్ డ్రైవింగ్‌లైసెన్స్ కలిగినవారిని తాత్కాలికడ్రైవర్లుగా నియమిస్తామని, అలాంటివారు ఆర్టీవో కార్యాలయాల్లో దరఖాస్తుచేసుకోవచ్చని రవాణాశాఖ ఉన్నతాధికారులు సూచించారు. 


ఒక్కో డ్రైవర్‌కు రోజు కు రూ.1500 చొప్పున భత్యం చెల్లించనున్నారు. పదోతరగతి ఉత్తీర్ణులైనవారిని వారి టెన్త్ మెమోను జామీనుగా పెట్టుకుని తాత్కాలిక కండక్టర్లుగా నియమించనున్నారు. వీరికి రోజుకు రూ.1000 చొప్పున చెల్లించనున్నారు. ఆర్టీసీ రిటైర్డ్ సూపర్‌వైజర్లు, క్లర్కులు, మెకానిక్కులను కూడా తాత్కాలిక విధులకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వీరికి కూడా భత్యం చెల్లిస్తారు. ఈ మేరకు వివిధ జిల్లాల్లో నోటిఫికేషన్లు ఇచ్చారు. భవిష్యత్తులో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకునే సందర్భాల్లో ఇటువంటివారికి ప్రాధాన్యం ఇస్తామని అధికారులు చెప్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: