తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగింది. త్రిసభ్య కమిటీతో కార్మిక సంఘాల చర్చలు విఫలమయ్యాయి. దీంతో ముందే నిర్ణయించినట్లుగా  ఈ అర్ధరాత్రి నుంచే సమ్మెకు దిగుతున్నట్లు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలేనందునే సమ్మెకు వెళుతున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రయాణీకులకు దసరా కష్టాలు తప్పడం లేదు.  


ఆర్టీసీ యాజమాన్యంతో కార్మికుల చర్చలు మరోసారి విఫలం అయ్యాయి. వరుసగా మూడో రోజు కూడా అధికారుల కమిటీ, కార్మిక సంఘాల జేఏసీ మధ్య చర్చలు విఫలం కావటంతో సమ్మె కొనసాగనుంది. శనివారం నుంచి సమ్మె యథాతథంగా కొనసాగనుందని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. ఎస్మాకు భయపడేది లేదని, ఆర్టీసీని బతికించడానికే తాము సమ్మె చేస్తున్నట్లు పేర్కొంది. ఎస్మా, పీడీ యాక్టులు తమకు కొత్తకాదని, ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందనటం తప్ప ఒక్క డిమాండ్‌కూ హామీ ఇవ్వడం లేదని కార్మిక సంఘాల నేతలు తెలిపారు.  

ఆర్టీసీ సమ్మెకు అన్ని సంఘాలు కలిసి రావాలని , డిపో మేనేజర్లు కూడా సమ్మెలో భాగస్వాములు కావాలని జేఏసీ పిలుపునిచ్చింది. ఆర్టీసీని బతికించడానికే తాము సమ్మె చేస్తున్నామన్నారు కార్మిక నేతలు. తాము ఎవరి చేతిలో కీలు బొమ‍్మలు కాదని, ప్రస్తుతం సకల జనుల సమ్మెను మించిన సమ్మె అవసరమని అన్నారు. తమ సమ్మె ద్వారా ప్రజలకు కలిసి ఇబ్బందికి చింతిస్తున్నామని తెలిపారు. మరోవైపు సమ్మెల్లో పాల్గొనే వారిని ఉద్యోగాల నుంచి డిస్మిస్‌ చేస్తామని ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేశారు. 


డిమాండ్ల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఐఏఎస్‌ల త్రిసభ్య కమిటీ ఏ నిర్ణయమూ తీసుకునే పరిస్థితుల్లో లేదని జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు. ఎలాంటి నోటీసులకు భయపడొద్దని, నిర్భయంగా కార్మికులు సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ జేఏసీ విజ్ఞప్తి చేసింది. ప్రజలకు ఉపయోగపడే ఆర్టీసీ సంస్థను ప్రభుత్వం కాపాడాలని కోరారు.  నాలుగేళ్లుగా ఏటా సమ్మె నోటీసు ఇస్తూనే ఉన్నామని, అయినా సమస్యను పరిష్కరించలేదని ఆర్టీసీ జేఏసీ ఆరోపించింది. సమ్మెలో 50 వేల మంది కార్మికులు పాల్గొంటారని జేఏసీ ప్రకటించింది. చాలా జిల్లాల్లో దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను ముందే నిలిపివేశారు. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: