మహారాష్ట్ర ఎన్నికలు ఇపుడు ఆసక్తికరంగా మారాయి. ఆ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న దాని కంటే కొత్త సీఎం ఎవరు అన్నది ఇంటెరెస్టింగ్ పాయింట్ గా ఉంది. బీజేపీ, శివసేన కూటమి ఈ ఎన్నికల్లో తలపడుతున్నాయి. ఈ రెండు పార్టీలకు  విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. మరో వైపు కాంగ్రెస్ నుంచి శరద్ పవార్ పార్టీ నుంచి కూడా అధికార బీజేపీ సేన కూటమిలోకి వెల్లువలా వలసలు వస్తున్నాయి.


ఇదిలా ఉండగా శివసేన తరఫున తొలిసారి గా బాల్ ఠాక్రే కుటుంబం నుంచి ఎన్నికల్లో పోటీకి దిగుతున్న యువ నేత ఆదిత్య ఠాక్రే మీద అందరి కళ్ళు ఉన్నాయి. బాల్ ఠాక్రే పార్టీని శాసించారు కానీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన వారసుడు ఉద్దవ్ ఠాక్రే కూడా శివసేన ప్రెసిడెంట్ గా ఉన్నారు తప్ప ఎపుడూ పోటీ చేసి ఎరగరు. ఇపుడు మూడవ తరంలో ఆదిత్య ఠాక్రెస్ ఎన్నికల భారతంలోకి  దిగారు.


దాంతో ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. గెలిస్తే ఆదిత్య ఠాక్రే సీఎం అన్న మాట సేన నోటి వెంట వస్తోంది. అదే సేనకు బలాన్ని, వూపుని ఇస్తోంది. గత కొన్నేళ్ళుగ బీజేపీకి జూనియర్ పార్టనర్ గా ఉన్న సేన ఈసారి ఎలాగైనా సీఎం కుర్చీలో కూర్చోవాలనుకుంటోంది. దాంతో సేన పట్టుదలకు ప్రతినిధిగా సొంత కుటుంబం  నుంచే వారసుడు వచ్చాడని అంటున్నారు.


ఈ పరిణామాలు బీజేపీకి చికాకు పెడుతున్నా ఎన్నికలు అయ్యేంతవరకూ వేచి చూడాలనుకుంటోంది. ఎలాగూ మెజారిటీ సీట్లకు బీజేపీ పోటీ చేస్తోంది కాబట్టి ఎక్కువ తమకే సీట్లు వస్తాయి, సహజంగానే తమ పార్టీ అభ్యర్ధి సీఎం అవుతారని బీజేపీ ధీమాగా ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 152 సీట్లకు, శివసేన 124 సీట్లు పోటీ చేస్తున్నాయి. ఇక మిగిలిన సీట్లు ఇతర పార్టీలకు కూటమి కేటాయించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: