పండక్కి ఊళ్ళు  వెళ్ళెందుకు ప్రయాణికులు......హక్కుల కోసం పోరాడుతూ కార్మికులు....ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి....ఇది నేడు తలంగాణ పరిస్థితి.   ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయాలనీ  టిఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అధికార పార్టీని కార్మిక సంఘాల తరపున నిలదీశారు. ఆర్టీసీ కార్మికుల గోడును పట్టించుకోవడం లేదని సీఎం కేసీఆర్‌పై లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 


దసరా పండగ నేపథ్యంలో ప్రయాణికుల గోడు కేసీఆర్‌కు పట్టనట్టు  ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. అటు ప్రయాణికులతో పాటు కార్మికుల సమస్యలను సీఎం కేసీఆర్ గాలికొదిలేశారని అయన మండిపడ్డారు.అధికారంలోకి వస్తే ఆర్టీసీని విలీనం చేస్తామని హామీనిచ్చినా కేసీఆర్.....ఇప్పటివరకు  కనీసం ఆర్టీసీ బకాయిలను కూడా చెల్లించలేదని లక్ష్మణ్ గుర్తుచేశారు.  ప్రయాణికులే ప్రగతి రథ చక్రాలు అని స్లోగన్స్ చెప్పే ప్రభుత్వం పండగపూట ప్రజలను  ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా కార్మికుల గొంతు నొక్కడం సబబు కాదన్నారు. 


ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తున్నామని చెప్పినా.. ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తు ఉండటం అంటే.... ఆ ప్రభుత్వ వైఫల్యం చెందినట్టేనని లక్ష్మణ్ విమర్శించారు. కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చినా కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కానీ, ట్రబుల్ షూటర్స్ అయిన మంత్రులు కానీ కార్మిక సంఘాల నాయకులతో ఎలాంటి చర్చలు జరపకుండా త్రిసభ్య కమిటీ వేసి చేతులు  దులుపుకున్నారన్నారు. సమ్మె కి వెళితే ఉద్యోగాలు పోతాయని హెచ్చరించడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

కార్మికులతో మొక్కుబడి చర్చలు జరిపారే తప్ప.. పరిష్కరించాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. తమ హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్మికులను  ఎస్మా ప్రయోగిస్తామని బెదిరిస్తు....   భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని లక్ష్మణ్ అన్నారు. చర్చలకు మాత్రం సిద్ధమని చెపుతూ కాలం వెళ్లదీయటం తప్ప కార్మికుల డిమాండ్లపై మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోయిందన్నారు. కేసీఆర్ సర్కార్ కార్మికుల జీవితాలతో ఆటలాడుతుందని విమర్శించారు. ఇది సరికాదని, ప్రభుత్వ చర్యతో కార్మికులు స్ట్రైక్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: