మహారాష్ట్ర ఎన్నిక‌ల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర శాసనసభకు ఈ నెల 21న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో లాతూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న సంతోష్ సబ్‌దే మాత్రం ఓ ప్ర‌త్యేక‌త‌ను సొంతం చేసుకున్నారు. రూ. పది వేల ఎన్నికల డిపాజిట్‌ను పది నాణేలతో చెల్లించారు. అయితే, ఆయ‌న ఓ మంచి కార్యం చేయ‌బోతే..అధికారులు మాత్రం ఊహించ‌ని షాకిచ్చారు. 



త‌న నామినేష‌న్ గురించి సంతోష్ మీడియాతో మాట్లాడుతూ,  పది నాణేలు చెలామణి కావడం లేదన్న అపోహ ప్రజల్లో ఉన్నది. ఇవి చెల్లుతాయని ప్రభుత్వం, బ్యాంకులు చెబుతున్నా వ్యాపారులు స్వీకరించడం లేదు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూ. పది నాణేలతో డిపాజిట్ చెల్లించినట్లు సంతోష్ తెలిపారు. అయితే, రూ.10 నాణేల‌తో డిపాజిట్ స‌మ‌ర్పించిన సంతోష్ ద‌ర‌ఖాస్తు విష‌యంలో అధికారులు అభ్యంత‌రం తెలిపారు.  వీటిని స్వీకరించేందుకు అధికారులు అంగీకరించలేదు. దీనిపై ఆయ‌న మీడియా ముందు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికారులు స్వీకరించక తప్పలేదు.


మ‌రోవైపు, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం 8 స్థానాల్లో పోటీచేస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాలు, అభ్యర్థుల పేర్లను సీపీఎం  అధికారికంగా ప్రకటించింది. ఎన్నికల్లో పోటీకి సంబంధించి సీపీఎం మహారాష్ట్ర శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ-శివసేన కూటమి ఓటమే లక్ష్యంగా తాము ఈ ఎన్నికల్లో ముందుకు సాగుతామని తెలిపింది. దీంతో పాటు రాష్ట్రంలో వామపక్షాల బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తామని తన ప్రకటనలో పేర్కొంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన సీపీఐ(ఎం) 5.76 శాతం ఓట్లను సాధించింది. కాగా, సీపీఎం త‌ర‌ఫున‌ షోలాపూర్‌ స్థానంలో నరసయ్య ఆదం, కల్వాన్‌లో జెపి గవిట్‌, పశ్చిమ నాసిన్‌లో డాక్టర్‌ డిఎల్‌ కరాడ్‌, ధహానులో వినోద్‌ నిఖోలే, సహాదాలో జైసింగ్‌ మాలి, పర్తూర్‌లో సరిత ఖండారే, షాహాపూర్‌లో క్రిష్ణ భవార్‌, పశ్చిమ అంధేరి నియోజకవర్గంలో కె.నారాయణన్‌ బరిలో నిలిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: