నియంత్రణ రేఖ, జమ్మూకశ్మీర్‌ అంతర్జాతీయ సరిహద్దు విష‌యంలో...కేంద్రం వ్యూహాత్మ‌కంగా క‌దులుతోంది. సున్నిత‌మైన ఆర్టిక‌ల్ 370 ఎత్తివేత అనంత‌రం...క‌శ్మీర్‌లో పాక్ రెచ్చ‌గొట్టే తీవ్ర‌వాదం ప్ర‌బ‌లే అవ‌కాశం ఉంద‌ని గ్ర‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేస్తోంది. జమ్మూకశ్మీర్‌ అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వ‌ద్ద‌ 8 వేల ఆరు వందల బంకర్ల నిర్మాణం పూర్తి చేసింది. సరిహద్దుల్లోని మొత్తం 5 జిల్లాల్లో ఈ నిర్మాణాలను చేపట్టింది. 


సరిహద్దుల్లో పాక్​ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ఫలితంగా స్థానికుల రక్షణార్థం బంకర్లను నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. 2017 డిసెంబర్​లో బంకర్ల నిర్మాణానికి 4 వందల 15 కోట్లను కేంద్రం విడుదల చేసింది. పూంచ్​ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి అత్యధికంగా దాదాపు నాలుగు వేల నాలుగు వందల బంకర్ల నిర్మాణాన్ని చేపట్టింది. రాజౌరీ జిల్లాలో ఒక వెయ్యి రెండు వందల బంకర్లను ఏర్పాటు చేసింది. సాంబా, కథువా, జమ్ములో సుమారు వెయ్యి బంకర్లను నిర్మించింది.


ఇదిలాఉండ‌గా,  అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అనంత్‌నాగ్‌లోని డిప్యూటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద ఉదయం 11గంటల సమయంలో ఉగ్రవాదులు అక్కడ గస్తీలో ఉన్న సిబ్బందిపైకి గ్రెనేడ్ విసిరారు. అయితే ఆ గ్రెనేడ్ గురితప్పి రోడ్డుపై పడి పేలిందని, దీంతో ఓ ట్రాఫిక్ పోలీసు సహా 14 మంది పౌరులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడిన వారందరినీ వెంటనే ఆస్ప‌త్రికి తరలించామని, 13 మందికి ప్రాథమిక చికిత్స అందించి పంపించామని చెప్పారు. ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడినప్పటికీ అతడు ప్రమాదం నుంచి బయటపడ్డాడని అధికారులు వివరించారు. ఈ పేలుడు స్థానికుల్లో భయాందోళనలు సృష్టించింది. కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత రెండోసారి ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. ఇంతకుముందు గత నెల 28న ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ సిబ్బందిపై గ్రెనేడ్ విసిరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: