ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న కొన్ని నిర్ణ‌యాల‌ను కేంద్రం తీవ్ర‌స్థాయిలో త‌ప్పుప‌ట్టింది. ముఖ్యంగా పోల‌వ‌రం రివ‌ర్స్ టెండ‌రింగ్‌, విద్యుత్ ప్రాజెక్టుల పీపీఏల ర‌ద్దు వంటివిష‌యాల‌ను కేంద్రం ఇప్ప‌టికీ విమ‌ర్శిస్తూనే ఉంది. సీఎంగా జ‌గ‌న్ ప్ర‌మాణం చేసిన రోజునే ఈ విష‌యంపై కేంద్ర మంత్రి ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు. ఒక ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌ను మ‌రో ప్ర‌భుత్వం ఎలా నిర్దేశిస్తుం ద‌ని ప్ర‌శ్నించారు. దీంతో పీపీఏల ర‌ద్దు అంశం వివాదానికి దారితీసింది.


అయితే, ఈ విష‌యంలో జ‌గ‌న్ అండ్ కో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు వెన‌క్కి త‌గ్గింది లేదు. పునరుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల పీపీఏల విష‌యంలో గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఉదారంగా వ్య‌వ‌హ‌రించిం ద‌ని ఆరోపిస్తూ.. వీటిని ర‌ద్దు చేసి తీరుతామ‌ని ప్ర‌క‌టించింది. అదే స‌మ‌యంలో పోల‌వ‌రం ప్రాజెక్టు రివ‌ర్స్ టెండ‌రింగ్‌లో తాము సాధించిన 800 కోట్ల పైచిలుకు లాభాలను కూడా చూపించింది. ఇలానే తాము విద్యుత్ పీపీఏల విష‌యంలోనూ లాభాల‌ను చూపిస్తామ‌ని జ‌గ‌న్ స‌ర్కారు కుండ‌బ‌ద్ద‌లు కొడుతోంది. అయిన‌ప్పటికీ.. కేంద్రం మాత్రం ఈ విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కారును టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతోంది.


పీపీఏల విష‌యాన్ని రెండు రోజుల కింద‌ట కూడా కేంద్రం మ‌రోసారి త‌ప్పుబ‌ట్టింది. తాము చెప్పిన త‌ర్వాత కూడా ఈ విష‌యంలో జ‌గన్ దూకుడు త‌గ్గ‌పోతే ఎలా అంటూ.. వ్యాఖ్య‌లు సంధించింది. అయితే, జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం ఇవేవీ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎలాగైనా కేంద్రానికి న‌చ్చ‌జెప్పాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు ల‌భించ‌ని అస్త్రం ఒక‌టి జ‌గ‌న్ చేతికి చిక్కింది. బీజేపీ పాలిత పెద్ద రాష్ట్రం యూపీలో విద్యుత్ పీపీఏల‌ను అక్క‌డి సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ఓవ‌ర్‌నైట్‌లో ర‌ద్దు చేశారు. గ‌తంలో చేసుకున్న ఈ ఒప్పందాల కార‌ణంగా రాష్ట్రం దాదాపు 600 కోట్ల వ‌ర‌కు న‌ష్టోపోతున్న‌ట్టు యోగి పేర్కొంటూ.. దీనిపై ఎవ‌రికీ ఎలాంటి వివ‌ర‌ణ కూడా ఇవ్వ‌కుండానే రాత్రికి రాత్రి ర‌ద్దు నిర్ణ‌యం తీసుకున్నారు.


కేవ‌లం ఆరు రోజుల కింద‌ట యోగి ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యంపై ఔన‌ని కానీ, కాద‌ని కానీ, అలా ఎందుకు చేశార‌ని కానీ.. కేంద్రంలోని పెద్ద‌లు స్పందించ‌లేదు. ఇదే ఇప్పుడు జ‌గ‌న్‌కు క‌లిసి వ‌స్తున్న అంశంగా మారింది.  ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యంలో ఎలాంటి అస్త్రాల‌ను చేజిక్కించుకోని జ‌గ‌న్ కు యోగి నిర్ణ‌యం పెద్ద వ‌రంలా క‌లిసివ‌చ్చే అవ‌కాశం చిక్కింది. ఇక‌పై,.. కేంద్రం పీపీఏల విష‌యంలో ఎలాంటి ప్ర‌శ్న‌లు సంధించినా.. యూపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని ఏక‌రువు పెట్టి.. మీకు ఒక న్యాయం.. మాకో న్యాయ‌మా? అని ప్ర‌శ్నించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి జ‌గ‌న్ ఈ ప‌రిణామాన్ని ఎలా వినియోగించుకుంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: