కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె, పరిణామాలు, వారి సమస్యల గురించి ఈ లేఖ రాశారు. గడచిన ఐదున్నరేళ్ల మీ పాలనలో ఆర్టీసీ పూర్తి నిర్లక్ష్యానికి గురైందని.. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలే ఉండకూడదని, వారిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఉద్యమ సమయంలో మీరు పెద్ద పెద్ద ప్రకటనలు చేశారని గుర్తు చేశారు.


“ ముఖ్యమంత్రి అయ్యాక ఊసరవెల్లిలా రంగులు మార్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికులకు న్యాయం చేయాల్సింది పోయి... ప్రైవేటీకరణతో సంస్థ మనుగడే లేకుండా చేయాలన్న కుట్రకు తెరతీశారు. కార్మికుల డిమాండ్లన్నీ న్యాయ సమ్మతమైనవే. ఐదున్నరేళ్లలో ఒక్కసారైనా వారిని ప్రగతి భవన్ కు పిలిచి మాట్లాడారా? వారి కష్టాలు, బాధలు వినే ప్రయత్నం చేశారా?


పైగా చిరు ఉద్యోగుల పై మీ నియంతృత్వ వైఖరి ప్రదర్శించడం దారుణం. డెడ్ లైన్ లోపు విధుల్లో చేరకుంటే ఉద్యోగాలు పీకేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మీరు చెప్పినట్టు వినకపోతే ఉద్యోగాలు పీకేయడానికి ప్రభుత్వం అంటే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాదు. కార్మికులేమీ మీ బానిసలు కాదు.


సమ్మె నివారణకు చొరవ తీసుకోవాల్సిన మీరు నేను చెప్పిందే వేదం, లేదంటే వేటే అంటూ మంకుపట్టు ప్రదర్శించడం పరిపక్వతలేని మీ మానసిక స్థితికి అద్దంపడుతోంది. కార్మికులు చేస్తోన్న డిమాండ్లలో న్యాయం ఉంది. డిమాండ్ల పై సానుకూలంగా స్పందించి, సమ్మె విరమణకు చొరవ తీసుకోండి. ఆర్టీసీ కార్మికులతో పెట్టకోవడం అంటే కొరివితో తల గోక్కోవడమే అని ఒకనాడు మీరు చేసిన ప్రకటనను గుర్తు చేస్తున్నాను. ప్రస్తుతం ఆ ప్రకటన మీకు కూడా వర్తిస్తుందన్న విషయం మర్చిపోవద్దు... అంటూ కేసీఆర్ కు హితవు పలికారు రేవంత్ రెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: