హైదరాబాద్‌లో మ‌రోమారు వ‌ర్ష‌బీభ‌త్సం చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం దాదాపు మూడుగంటల పాటు హైదరాబాద్‌లో భారీగా వర్షం పడింది. దీంతో న‌గ‌రంలోని పలు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ వ‌ర్షం సంద‌ర్భంగా ప‌లు చిత్రాలు, ఆస‌క్తిక‌ర ఘ‌ట్టాలు చోటుచేసుకున్నాయి. ఈరోజు పడిన వర్షానికి  లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరాయి. కూకట్ పల్లి, అల్విన్ కాలనీ, మియాపూర్ సహా చాలా ప్రాంతాల్లో ప్రజలు కష్టాలు ఎదుర్కొన్నారు. కొన్ని కాలనీల్లో బైక్ లు వరదకు కొట్టుకుపోయాయి.


మధ్యాహ్నం 1.30 నుంచి దాదాపు మూడు  నాలుగు గంటల పాటు భాగ్యనగరాన్ని వాన ముంచెత్తింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు ట్రాఫిక్ లో ఇబ్బందులు పడ్డారు. ఎల్బీ నగర్ కాకతీయ కాలనీలో పడిన భారీ వర్షానికి ఓ మహిళ వరదలో కొట్టుకుపోతుండగా ఓ యువకుడు ఆమెను రక్షించాడు. ఈ విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.మ‌రోవైపు,జీడిమెట్ల సూరారంలో మంత్రి మల్లారెడ్డికి చెందిన నారాయణ హాస్పిటల్ లోకి భారీగా వాన నీళ్లు చేరాయి. ఐసీయూల్లోకి కూడా నీళ్లు వచ్చాయి. దీంతో పేషెంట్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నీరు ఆగకుండా లోపలికి వస్తుండడంతో పేషెంట్లను మరో చోటకి ఆస్పత్రి యాజమాన్యం మార్చింది. 


కాచిగూడ, అంబర్‌పేట్‌, చిక్కడపల్లి, ముషీరాబాద్‌, నాగోల్‌, బండ్లగూడ, కోఠి, గోషామహల్‌, నాంపల్లి, బషీర్‌బాగ్‌, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, ఉప్పల్‌, చింతల్‌కుంట, సైదాబాద్‌, చంపాపేట్‌, సరూర్‌నగర్‌, బేగంపేట్‌, కూకట్‌పల్లి, జీడిమెట్ల, దుండిగల్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, కుషాయిగూడ , జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సుందరయ్య పార్కు రోడ్డులో మోకాల్లోతులో వర్షపు నీరు నిలిచింది.


సిటీలో వేర్వేరు ప్రాంతాల్లో వర్షపాతం
కుత్బుల్లాపూర్ – 7.8 సెంటీమీటర్లు
అల్విన్ కాలనీ – 6.6 సెంటీ మీటర్లు
అంబర్ పేట్: 5.9 సెంటీమీటర్లు
రామాంతపూర్ – 5.7 సెంటీమీటర్లు
హైదర్ నగర్ – 5.5 సెంటీమీటర్లు
ముషీరాబాద్ – 5.1 సెంటీమీటర్లు

కాగా,  తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పలుప్రాంతాల్లో వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. సిద్ధిపేట జిల్లా చింతల చెరువు దగ్గర పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చింతలచెరువు దగ్గర పిడుగుపాటు ఘటన దురదృష్టకరమని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయాలైన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. గాయపడిన సారయ్యను మంత్రి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. పిడుగుపాటుతో మృతి చెందిన ఇద్దరి కుటుంబాలకు హరీశ్‌రావు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: