ఆయనో ఐఏఎస్ అధికారి.. ప్రజల కోసం పాటుపడతాడని పేరుంది. కానీ ఎందుకనో ఆయన్ను కేసీఆర్ లూప్ లైన్లో ఉంచారు. అంత ప్రాధాన్యం లేని పోస్టులో ఉంచారు. దీంతో ఆసంతృప్తికి గురైన ఆయన స్వచ్చంద పదవీ విరమణ తీసుకున్నారు. ఇప్పుడు ఆయన్ను ఏపీ సీఎం జగన్ కోరి మరీ తన టీమ్ లోకి తీసుకున్నారు. ఆయనే ఆకునూరి మురళి.


మారుమూల ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండే ఐఎఎస్‌ అధికారి ఆకునూరి మురళి, పనిలేని చోట కూర్చొని జీతం తీసుకోవడం ఇష్టం లేక, తెలంగాణ ప్రభుత్వంలో ఆయన ఉండననుకున్నారు. ఆయన్ను కూడా ప్రభుత్వం వద్దనుకుంది. సీన్‌ కట్‌ చేస్తే , ఒక సామాజిక దృక్పధంతో విద్య,వైద్యం మెరుగుదలకు కృషి చేస్తున్న జగన్‌ ప్రభుత్వం మురళి సేవలు పొందాలనుకొని, ఏకంగా ప్రభుత్వ సలహాదారుడి పదవి కట్టబెట్టింది.


ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా చేరిన వారితో పోలిస్తే ఆకునూరి మురళి వల్లనే ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుందని, తెలంగాణలో గురుకుల విద్యను సుసంపన్నం చేసిన ప్రవీన్‌కుమార్‌లా , మురళి దూసుకుపోతారని, జగన్‌ తీసుకున్న అద్భుతమైన నిర్ణయం అని, రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు.


ఆకునూరి మురళి పాలనాధికారిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. ఏ అంశమైనా కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడుతారని, అధికార వర్గాలు చెబుతూ ఉంటాయి. తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ గా ఉన్న సమయంలో కొన్ని వివాద స్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రభుత్వం ఆయన్ను తెలంగాణ స్టేట్‌ ఆర్కీవ్స్‌ కార్యదర్శిగా ప్రాధాన్యత లేని పోస్టులో నియమించింది. ఫలితంగా ఆయన స్వచ్చంద పదవీ విరమణకు నిర్ణయం తీసుకున్నారు.


ఆ సందర్బంలో మీడియాతో మాట్లాడుతూ, ” విద్యా వ్యవస్థ చాలా అధ్వాన్నంగా ఉంది. తెలంగాణలో కూడా స్కూళ్లలో మౌలిక వసతులు సరిగ్గా లేవని, ఏదైనా స్వచ్ఛంద సంస్ధతో కలిసి, విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఉంది..” అన్నారు. ఆయన ఆశయానికి తగినట్టుగానే, ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్య, మౌళిక వసతుల కల్పిన సలహాదారుడిగా నియమిస్తూ, నిర్ణయం తీసుకుంది. ఆయన మరో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కావాలని కోరుకుందాం..


మరింత సమాచారం తెలుసుకోండి: