ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 1వ తేదీ నుండి నూతన మద్యం విధానం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రమంతటా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. మద్యం అమ్మకాలు రాత్రి 8వరకే జరుపుతూ ఉండటంతో ప్రభుత్వానికి గతంతో పోలిస్తే ఆదాయం తక్కువగా వస్తోందని తెలుస్తుంది. గతంతో పోలిస్తే ప్రభుత్వం 20 శాతం వరకు ప్రభుత్వం మద్యం దుకాణాలను తగ్గించింది. 
 
ప్రస్తుతం మద్యం కొనుగోలు చేయాలంటే ఆధార్ తప్పనిసరి చేయాలని కొందరి నుండి డిమాండ్ వినిపిస్తోంది. విశాఖపట్నం జిల్లాలోని ఒక ఎన్జీవో వైసీపీ ప్రభుత్వాన్ని మద్యం కొనుగోలుకు ఆధార్ తప్పనిసరి చేయాలని కోరుతోంది. ఎన్జీవోలోని సభ్యులు మద్యం కొనుగోలుకు ఆధార్ లింక్ చేయటం వలన చాలా ఉపయోగాలున్నాయని ప్రభుత్వం ఎంత మద్యం అమ్ముతోంది మరియు సగటున ఒక్కొక్కరు ఎంత మద్యం తాగుతున్నారు అనే విషయాలు తెలుసుకోవచ్చని చెబుతున్నారు. 
 
విశాఖలోని చైతన్య స్రవంతి ఎన్జీవో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ శిరీన్ రెహ్మాన్ మాట్లాడుతూ మద్యం కొనుగోలుకు ఆధార్ లింక్ చేయటం వలన ప్రజలకు మద్యం గురించి గణాంకాలతో సహా తెలుస్తుందని అన్నారు. మద్యం ఎవరెవరు తీసుకుంటున్నారో వారికి మద్యం తాగటం వలన కలిగే చెడు ప్రభావాల గురించి వివరించి చెప్పవచ్చని అన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం దిశగా చర్యలు తీసుకోవటం మరియు మద్యపాన నిషేధానికి శ్రీకారం చుట్టటం సంతోషంగా ఉందని అన్నారు. 
 
ప్రభుత్వం ఆధార్ ఆధారంగా మద్యం అమ్మకాలు జరపాలని కోరారు. మద్యపాన నిషేధం అమలు కొరకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ముందుకు రావాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా మద్యపాన నిషేధం విషయంలో చొరవ తీసుకోవాలని అన్నారు. మరి ప్రభుత్వం ఎన్జీవో సభ్యులు ఇచ్చిన సూచనలను తీసుకొని మద్యంకు ఆధార్ తప్పనిసరి చేస్తారో లేదో చూడాలి. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: