ఆరే కాలనీలో చెట్ల నరికివేతపై సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చెట్ల నరికివేతను నిలిపివేయాలని, కేసును అక్టోబర్ 21కి వాయిదా వేసింది. ముంబయి మెట్రో కోసం వేలాది చెట్ల నరికివేతకు మహారాష్ట్ర సర్కారు రెడీ అయింది. దీనిపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ముంబయిలోని ఆరే కాలనీ చెట్ల నరికివేత అంశం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు.. కేసును తక్షణమే విచారణ చేపడతామని స్పష్టం చేయటమే కాదు.. ప్రత్యేక ధర్మాసనాన్ని కూడా ఏర్పాటు చేసి, ఆరే కాలనీలో చెట్ల నరికివేతను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.  తదుపరి విచారణ అక్టోబరు 21కి వాయిదా వేసింది. మెట్రో రైల్ షెడ్ కోసం ముంబయి ఆరే కాలనీలో 2500కు పైగా చెట్లు నరికి వేస్తుండటంపై వివాదం ముదురుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ తీరుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. చెట్ల తొలగింపుకు వ్యతిరేకంగా ఆరే కాలనీ ప్రజలతో పాటు,  పలువురు సామాజిక ఉద్యమకారులు, విద్యార్ధులు ఉద్యమిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. అయితే చెట్ల నరికివేతను శివసేన నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే బీజేపీ లీడర్లు సమర్ధిస్తున్నారు. అయితే  ఈ రెండు పార్టీలు డ్రామా చేస్తున్నాయని కాంగ్రెస్, ఎన్సీపీ ఆరోపిస్తున్నాయి. 


అయితే మెట్రో నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు పర్యావరణ కార్యకర్తలు ముంబయి హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. కోర్టు నుంచి అనుమతి లభించడంతో గత శుక్రవారం అర్థరాత్రి మెట్రో సిబ్బంది చెట్లను కూల్చేందుకు ప్రయత్నించారు. దీంతో ఆరే కాలనీలో హైడ్రామా చోటుచేసుకుంది. తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి 29 మంది సామాజిక ఉద్యమకారులు అరెస్ట్ చేసి, నాన్-బెయిలబుల్‌ కేసు నమోదుచేశారు. దీంతో ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కు కొందరు స్టూడెంట్స్ లెటర్ రాశారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా కేసును చేపట్టారు. కేసు విచారణకు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్ తో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ ఈ అంశాన్ని విచారించింది. ఆరే కాలనీలో చెట్ల నరికివేతను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ అంశంపై పూర్తిస్థాయిలో విచారిస్తామన్న ధర్మాసనం.. తదుపరి విచారణను అక్టోబరు 21కి వాయిదా వేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: